కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమని భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని తీసుకురావటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముంబయిలో ఓ పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న శక్తికాంత దాస్ పలు విషయాలపై మాట్లాడారు.
"కరోనా వైరస్‌తో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అందుకు కావాల్సిన వనరులు మన వద్ద ఉన్నాయి. విదేశీ మారక నిల్వలు తగినన్ని ఉన్నాయి. అవసరమైతే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సాయాన్ని కోరుతాం."
- శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
ద్రవ్య లభ్యత సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐఎంఎఫ్ నిబంధనలను సరళీకరించాలని పేర్కొన్నారు దాస్. అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు కలిసి సమన్వయంతో కృషి చేయాలన్నారు.
దేశంలో పలు రంగాలు చైనాపై ఆధారపడిన కారణంగా వాటిపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు దాస్. అయితే ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అంతర్జాతీయ వ్యవస్థపై భారీగా ఆధారపడని కారణంగా కరోనా ప్రభావం భారత్‌పై పరిమితంగానే ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఎస్ బ్యాంక్‌పై...
ఎస్ బ్యాంక్ సమస్యను 30 రోజుల్లోనే పరిష్కరిస్తామని శక్తికాంత దాస్ వెల్లడించారు. దేశంలో బ్యాంకింగ్ రంగం స్థిరత్వాన్ని సాధించేందుకే ఎస్ బ్యాంక్‌పై మారటోరియాన్ని విధించామని తెలిపారు. ఇందుకు ఇదే సరైన సమయమని.. త్వరలోనే కొత్త పథకంతో ముందుకు వస్తామని హామీ ఇచ్చారు.