గత వారం రాజకీయ కారణాల వల్ల స్వల్ప ఆటుపోట్లకు లోనయ్యాయి స్టాక్ మార్కెట్లు. అయితే ఈ వారం రెపో రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో మార్కెట్లను ఎటువైపు నడిపిస్తాయన్న అంశంపై నిపుణుల విశ్లేషణలు మీకోసం.
దేశీయ కారణాలు
ఇటీవల ప్రకటించిన 2018-19 చివరి త్రైమాసిక గణాంకాల్లో ఆర్థిక వృద్ధి ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వ్యవసాయ రంగం, తయారీ రంగాలు నెమ్మదించాయి. ఈ కారణాలతో 2018-19 చివరి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5.8 శాతంగా నమోదైంది.
గత వారం చివరి సెషన్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడిన కారణంగా మార్కెట్లపై పెద్దగా ప్రభావం పడలేదు. అయితే ఈ వారం తొలి సెషన్లో మాత్రం ఈ గణాంకాల ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఫలితంగా స్వల్ప ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే వృద్ధికి ఊతమందించే దిశగా ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం ఉండొచ్చనే అంచనాలు మార్కెట్లకు సానుకూల అంశంగా మారొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6న రెపో రేట్లపై నిర్ణయాన్ని ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ప్రకటించనుంది.
"ఆర్థిక మంత్రిగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. ఆమెపై చాలా ఆశలున్నాయి. నిధుల సమస్య ఉంది. బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ప్రధాన సవాళ్లు. " - ముస్తాఫ నదీమ్, ఎపిక్ రీసర్చ్ సీఈఓ.
అంతర్జాతీయ పరిణామాలు
ఈ వారం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంతర్జాతీయ అంశం అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం. ఎన్నో నెలలుగా సాగుతున్న ఇరు దేశాల వాణిజ్య యుద్ధంలో తాజాగా చైనా ప్రతిచర్యలకు సిద్ధమైంది. అమెరికా వస్తువులపై 60 బిలియన్ డాలర్ల మేర సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు చమురు ధరల ప్రభావం కూడా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లపై పడనుంది.
గత వారం ట్రేడింగ్ ఇలా
స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్ప ఆటుపోట్ల నడుమ జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసినా... చివరి సెషన్‌ను సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో ముగించింది. అయితే వారం మొత్తం మీద చూస్తే 279 పాయింట్లు పుంజుకుంది సెన్సెక్స్.
ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం నేపథ్యంలో జూన్ 5న స్టాక్ మార్కెట్లకు సెలవు.
ఇదీ చూడండి: సిరి: సిబిల్ స్కోరు పెంచుకోండి ఇలా...