ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి... తనను ఆహ్వానిస్తే కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు రాజన్. ఆయన కొత్త పుస్తకం 'ది థర్డ్ పిల్లర్' ఆవిష్కరణ కార్యక్రమంలో రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ప్రధాన ఆర్థిక వేత్తగా పనిచేసిన రఘురామ్ రాజన్... రెండోసారి ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని తిరిస్కరించారు.
ప్రస్తుతం తాను ఉన్నస్థాయిలో సంతోషంగానే ఉన్నానని... అయితే తన అవసరం ఉందనుకుంటే కూటమి వారితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కనీస ఆదాయం ఏడాదికి రూ. 72,000 ఇచ్చేందుకుగానూ... 'న్యూన్తమ్ ఆయ్ యోజన' పథకాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. దీని ద్వారా 20 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
దీని సాధ్యాసాధ్యాలపై తాము సంప్రదించిన ఆర్థికవేత్తల్లో రఘురామ్ రాజన్ కూడా ఒకరని ప్రకటించారు. దీనిపై స్పందించాలని రాజన్ను కోరగా ఇది ఇప్పుడే చర్చించాల్సిన విషయం కాదన్నారు.
ఒకవేళ అనుకున్నట్లే కూటమి గెలిచి... తనను ఆర్థిక మంత్రిగా చేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రశ్నకు రాజన్ స్పందించారు.
వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం సహా సంస్కరణల ద్వారా ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్యమని రాజన్ పేర్కొన్నారు.
బ్యాంకులను వీలైనంత త్వరగా ప్రక్షాళన చేసి వాటిని వృద్ధి దిశగా పయనింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టంగా మార్చాల్సి ఉందని రాజన్ పేర్కొన్నారు.