ఇటీవల కాలంలో అధిక వడ్డీ దారుణాల గురించి మనం వింటూనే ఉన్నాం. అవసరానికి అప్పు చేయడం తప్పేమీ కాకపోవచ్చు. కానీ, అది మనల్ని ఇబ్బంది పెట్టనంత వరకే.. అందుకే, సురక్షితంగా, భారం లేని రుణం తీసుకునేందుకు ఏం చేయాలన్నది తెలుసుకుందాం.
వడ్డీ రేటుతోనే సమస్య...
రుణం తీసుకునే తొందరలో చాలామంది వడ్డీ రేటు ఎంతన్నది గమనించరు. కానీ, ఇదే కీలకం అని మర్చిపోవద్దు. ప్రస్తుతం ఎంత వడ్డీ రేటు వరకూ రుణాలు లభిస్తున్నాయన్నది ముందుగా తెలుసుకోండి. వ్యక్తిగత రుణాలను ఇచ్చే సంస్థలు ఎంత వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయన్నది గమనించండి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ విషయాన్ని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతోపాటు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఫినెట్‌క్ అంకురాలు ఇస్తున్న అప్పులపై వడ్డీ రేట్లను పరిశీలించండి. సాధారణంగా మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారికి తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. ముందుగానే మనకు వర్తించే రేటును తెలుసుకోవడం ద్వారా ఎక్కడ అప్పు తీసుకోవచ్చనే విషయంలో ఒక అవగాహన వస్తుంది. తొందరలో అధిక వడ్డీకి అప్పు తీసుకొని, దాన్ని తీర్చలేక ఇబ్బందులు పడటంకన్నా.. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మేలు.
ఎంత వరకు భరించగలరు..
గరిష్ఠంగా ఎంత వరకు అప్పును మీరు భరించగలరు అనే అంశంతోపాటు, ఎంత వడ్డీ చెల్లించగలరు అనేదీ స్పష్టత ఉండాలి. వడ్డీ రేటు, ఈఎంఐ, దాని భారం ఎంత వరకూ ఉంటుందనేది తెలుసుకునేందుకు ఈఎంఐ కాలిక్యులేటర్లను ఉపయోగించండి. రుణాన్ని ఇచ్చే సంస్థలు కేవలం వడ్డీ రేటును మాత్రమే పేర్కొంటాయి. కానీ, రుణం ఇచ్చే ముందు, తర్వాత విధించే రకరకాల రుసుముల సంగతిని చెప్పవు. కొన్ని రుసుములు వసూలు చేయకపోవచ్చు. కానీ, వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. మరికొన్ని ఫీజులను వసూలు చేసినా, తక్కువ వడ్డీ విధిస్తాయి. ఆన్‌లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్లతో వీటన్నింటినీ గణించినప్పుడు.. ఏ రుణానికి ఎంత వరకూ భారం పడుతుందన్న సంగతిని స్పష్టంగా తెలుసుకోవచ్చు. అప్పు తీసుకున్న తర్వాత చెల్లించాల్సిన ఈఎంఐని బట్టి, మనకు అది సులభమా.. కష్టమా అనేది అర్థం అవుతుంది. దీన్ని బట్టి, మీ ఇతర ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలి. అప్పుడే రుణం తీసుకున్నా.. కష్టం లేకుండా తీర్చేయవచ్చు.
క్రెడిట్ స్కోరు చూడండి..
ఎంత వరకూ రుణం భరించగలరో చూసుకున్నాక.. మీ క్రెడిట్ స్కోరును పరిశీలించండి. అప్పు కావాలని మీరు దరఖాస్తు చేయగానే బ్యాంకులు, రుణసంస్థలు మీ క్రెడిట్ నివేదికను విశ్లేషిస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు అంటే 750 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే.. మీకు కొత్త రుణాలు లభించడంలో ఇబ్బందేమీ ఉండదు. ఒకవేళ తక్కువగా ఉంటే.. రుణం వచ్చినా.. అధిక వడ్డీ చెల్లించేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.
హామీతో..
తక్కువ క్రెడిట్ స్కోరున్న వారికీ... ఏదైనా కారణంతో రుణ చరిత్ర దెబ్బతిన్న వారికి వ్యక్తిగత రుణం లభించడం కష్టమవుతుంది. అంతేకాకుండా వడ్డీ రేటూ అధికంగా చెల్లించాల్సి వస్తుంది. వ్యక్తిగత రుణం హామీ లేకుండా లభించే అప్పు. రుణ చరిత్ర సరిగా లేని వ్యక్తులకు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు రిస్క్ ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. అధిక వడ్డీకి కారణం ఇదే. ఇలాంటప్పుడు హామీ లేని వ్యక్తిగత రుణంకన్నా.. హామీతో ఉండే అప్పును తీసుకోవడం మేలు. ఇలాంటి సందర్భాల్లో తక్కువ వడ్డీకి రుణం దొరికే అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోరుతో సంబంధం లేకుండా ఈ రుణాలు తీసుకోవచ్చు.
హామీతో కూడిన రుణాలంటే.. బంగారంపై, షేర్లు, ఫిక్సెడ్ డిపాజిట్లు, బీమా పాలసీలు, కార్లు, ఆస్తులు తదితరాలను హామీగా పెట్టి, అప్పులు తీసుకోవడం అన్నమాట. మీకు కావాల్సిన మొత్తాన్ని బట్టి, దేన్ని హామీగా పెట్టాలన్నది నిర్ణయించుకోవచ్చు.
ప్రత్యామ్నాయాలున్నాయా...
మీ ఆదాయంతో పోలిస్తే అప్పుల నిష్పత్తి ఎక్కువగా ఉన్నాయనుకోండి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొత్త రుణాలను ఇచ్చేందుకు అంతగా ఇష్టపడవు. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. క్రెడిట్ కార్డుపై వ్యక్తిగత రుణం తీసుకున్నప్పుడు వడ్డీ ఎక్కువగా ఉంటుంది. తప్పదు అనుకుంటే దీన్ని పరిశీలించవచ్చు. ఇప్పటికే ఉన్న ఇంటి రుణంపై టాపప్ లోన్ తీసుకునే అవకాశాన్ని చూడండి. దీనికి వ్యక్తిగత రుణం కన్నా వడ్డీ తక్కువగా ఉంటుంది. ఇక చివరి అవకాశంగా.. మీ కుటుంబ సభ్యులు.. లేదా తెలిసిన వారి నుంచి అత్యవసరానికి డబ్బు తీసుకోండి. రుణం తీసుకోవడం కాదు.. దాన్ని ఎలా తీర్చాలన్నదీ ప్రణాళిక వేసుకోవాలి.
ప్రజల అవసరాన్ని, బలహీనతలను ఆసరాగా తీసుకొని కొన్ని సంస్థలు అధిక వడ్డీ రేటుకు రుణాలను ఇస్తున్నాయి. ఈ రుణ సంస్థలకు ఎలాంటి నియంత్రణ సంస్థల అనుమతీ ఉండదు. రుణం తీర్చకపోతే అవి చేసే ఆగడాలను తట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి, ఎప్పుడూ ఆర్‌బీఐ ఆమోదించిన సంస్థల నుంచి మాత్రమే రుణాలు తీసుకోవాలి.
రచయిత- అధిల్ శెట్టి
ఇదీ చదవండి:దేశంలో తొలి 3డీ ఇల్లు కట్టేశారు