ఇప్పటివరకు ఏ ఆరోగ్య సంరక్షణ పథకం పరిధిలో లేని మధ్యతరగతి ప్రజల కోసం ఒక ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తోంది నీతి ఆయోగ్. దేశంలో 40 శాతం జనాభాకు అందుతున్న ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి వచ్చేవారిని మినహాయించి కొత్త ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
నివేదిక సిద్ధం
కొత్త ఆరోగ్య వ్యవస్థపై ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్ సమక్షంలో దిల్లీలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఓ నివేదికను విడుదల చేశారు.
'ధనికులు వైద్య అవసరాలకు అయ్యే ఖర్చును భరించే శక్తి కలిగి ఉన్నారు. పేదల కోసం ఆయుష్మాన్ భారత్ ఎలాగో ఉంది. ఇప్పటికీ 50శాతం మంది ఏ ఆరోగ్య పథకమూ అందక ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆరోగ్య వ్యవస్థను మధ్యతరగతి వారికీ అందుబాటులో ఉంచేందుకు ఓ మార్గాన్ని నిర్దేశించడమే ఈ నివేదిక ముఖ్య ఉద్దేశం' అన్నారు నీతి ఆయోగ్ సలహాదారు అలోక్ కుమార్.
మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది లేని రీతిలో రూ.200-300 ప్రీమియంతో కొత్త ఆరోగ్య సంరక్షణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు సంకేతాలిచ్చారు కుమార్.