Economic survey: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది కేంద్రం. 2021-22లో జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23లో జీడీపీ వృద్ధి 8-8.5 శాతం ఉంటుందని లెక్కగట్టింది. 2020-21లో జీడీపీ 7.3 శాతం క్షీణించిందని సర్వేలో స్పష్టమైంది.
దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలు, జీడీపీ అంచనాలను సర్వేలో పొందుపర్చారు ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్. ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు. అనంతరం లోక్‌సభ వాయిదా పడింది. ఆ తర్వాత ఆర్థిక సర్వేను రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదాపడింది.
ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు...
- దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థితికి చేరుకున్నాయి.
- 2022-23లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థ సంసిద్ధంగా ఉంది.
- 2021 ఆర్థిక సంవత్సరంలో లోటు పెరిగినప్పటికీ.. 2021-22లో ప్రభుత్వ ఆర్థిక స్థితి మెరుగవుతుంది.
- టీకాల సరఫరా, సరఫరా విభాగంలో అమలు చేసిన సంస్కరణలు 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిని నిర్దేశిస్తాయి.
- ఎగుమతుల వృద్ధి బలంగా ఉండటం కూడా ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది.
- బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఐదు దేశాల జాబితా నుంచి అత్యధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న నాలుగు దేశాల్లో ఒకటిగా భారత్ ఎదిగింది.
ఆర్థిక సర్వే సూచనలు
- సాంకేతికతను ఉపయోగించి.. చిన్న కమతాల్లో ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.
- రైతులు వైవిధ్యమైన పంటలు పండించేలా చూడాలి. నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలి.
- 2070 నాటికి భారత్ కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి(నెట్ జీరో) తీసుకురావాలంటే.. క్లైమెట్ ఫైనాన్స్‌ను విజయవంతంగా నిర్వహించడం ముఖ్యం.
Budget Survey 2022:
ఏంటీ ఆర్థిక సర్వే?
ఆర్థిక సర్వే.. ఆర్థిక వ్యవస్థలో పలు రంగాల పరిస్థితిని తెలియజేస్తుంది. తద్వారా మొత్తం మీద ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టడానికి చేయాల్సిన విధాన మార్పులతో పాటు.. ప్రభుత్వం ఏం చేయాలన్నదానిపైనా సూచనలు చేస్తుంది.
ఎవరు తయారు చేస్తారు?
ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ), ఆయన బృందం తయారు చేస్తుంది. పార్లమెంటు ఉభయ సభల్లో బడ్జెట్‌కు ఒక రోజు ముందు దీనిని ప్రవేశపెడతారు. 1950-51లో తొలిసారిగా ఆర్థిక సర్వే తీసుకువచ్చారు. 1964 వరకు దీనిని బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టారు. అయితే ఆ తర్వాత దీనిని విభజించి, విడిగా ఇస్తున్నారు.
సర్వేలో ఉండే అంశాలు..
సాధారణంగా సర్వే రెండు విభాగాలుగా ఉంటుంది. తొలి భాగంలో కీలక అంశాలపై ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అభిప్రాయాలు, సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. ఆర్థిక వ్యవస్థపై స్థూలంగా సమీక్ష ఉంటుంది.
రెండో భాగంలో మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై ఇచ్చిన గణాంకాలు ఉంటాయి. అయితే అన్నీ ఒకే రూపంలో (ఫార్మాట్) ఉండాలని లేదు. సీఈఏ అభిప్రాయాలకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి:
పరిమితుల మధ్యే నిర్మలమ్మ బడ్జెట్.. వరాలిస్తారా?
నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో.. వివిధ రంగాలు ఏం కోరుతున్నాయంటే?