గత కొద్ది రోజులుగా బంగారం ధరలు చుక్కల నంటుతున్నాయి. ఫలితంగా పసిడికి డిమాండ్ తగ్గి ఆభరణాల పరిశ్రమలో చేతివృత్తిని నమ్ముకున్న వారి జీవితాలు అగమ్యగోచరంగా మారింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని 'ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్' (జీజేసీ) తెలిపింది. మాంద్యం ప్రభావం ఆభరణాల పరిశ్రమపై తీవ్రంగా ఉందని పేర్కొంది.
ఈ ఏడాది బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచింది కేంద్రం. కస్టమ్స్ సుంకం పెంపు, జీఎస్టీ కారణంగా పసిడి ధరలు పెరిగి.. కొనుగోళ్లు తగ్గాయి.
సుంకాలు, జీఎస్టీ తగ్గించాలి
బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 12.5 నుంచి 10 శాతానికి తగ్గించాలని, జీఎస్టీ రేటును ఒక్క శాతంగా నిర్ణయించాలని జీజేసీ వైస్ ఛైర్మన్ శాంకర్ సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధిక సుంకాలు విధించడం వల్ల బంగారం అక్రమ రవాణాకు దారి తీస్తుందన్నారు.
ఈఎమ్ఐ, పాన్ వెసులు బాటు
బంగారం కొనుగోలు విషయంలో ఈఎమ్ఐ పథకాలను రూపొందించాలని కౌన్సిల్ తరఫున ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు సేన్. పసిడిని ప్రతిఒక్కరు హోదాగా భావిస్తారు. కాబట్టి కొనుగోలు విషయంలో పాన్ కార్డు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని సూచించారు.