ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు క్షీణత 8 శాతంగా నమోదవ్వొచ్చని పరిశ్రమల విభాగం 'ఫిక్కీ' మంగవారం ప్రకటించింది. ఇదే నెలలో చేసిన ఎకానమిక్ ఔట్లుక్ సర్వే ద్వారా ఈ అంచనాలు వెల్లడించింది. ప్రముఖ ఆర్థికవేత్తలు బ్యాంకింగ్, ఆర్థిక విభాగాలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.5 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని వివరించింది ఫిక్కీ. 2020-21లో సానుకూల వృద్ధి రేటును నమోదు చేసే రంగం ఇదొక్కటేనని పేర్కొంది. లాక్డౌన్ సమయంలోనూ వ్యవసాయ కార్యకలాపాలు సాగటం, రుతుపవనాల సానుకూలతలు ఇందుకు కారణమని తెలిపింది.
పారిశ్రామిక, సేవా రంగాలు మాత్రం 2020-21లో వరుసగా 10 శాతం, 9.2 శాతం క్షీణతను నమోదు చేయొచ్చని అంచనా వేసింది ఫిక్కీ. కరోనా వల్ల ఈ రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు వివరించింది.
త్రైమాసికాల పరంగా చూస్తే.. 2020-21లో క్యూ 4లో 0.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశముందని తెలిపింది ఫిక్కీ. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 9.6 శాతంగా నమోదవుతుందని ఫిక్కీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి:2021లో భారత వృద్ధి రేటు 7.3%: ఐరాస