అనుకోని పరిస్థితుల్లో ఉపయోగపడే అత్యవసర నిధి ఎప్పుడూ మన దగ్గర ఉండాల్సిందే. కొవిడ్-19 రెండో దశ ఉద్ధృతి తర్వాత దీని అవసరం మరింతగా పెరిగింది. అనుకోని వైద్య ఖర్చులు ఎంతోమందిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాయి. అప్పులు చేయక తప్పని పరిస్థితిని తీసుకొచ్చాయి. అందుకే చేతిలో తప్పనిసరిగా అత్యవసర నిధి ఉండాలని చెబుతుంటారు. మరి, దీనిని ఎలా జమ చేయాలి?
ఎంత మొత్తంలో..
ఆదాయం, ఖర్చులను బట్టి.. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తంలో అత్యవసర నిధి ఉండాలి. అయితే, కొవిడ్-19 పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉండాల్సిన అవసరమూ ఉందనిపిస్తోంది. ఎంత ఎక్కువగా ఉంటే అంత శ్రేయస్కరం. ఒకసారి అత్యవసర నిధి ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఎప్పటికప్పుడు దాన్ని పెంచుతూ వెళ్లడమూ ముఖ్యమే. వాడుకున్న మొత్తాన్ని ఆ మేరకు భర్తీ చేయడమూ తప్పనిసరి. మారిన ఆదాయం, జీవన ప్రమాణాలు ఇతర అంశాల ఆధారంగా ఏడాదికోసారి మీ అత్యవసర నిధిని సమీక్షించు కోవడం మర్చిపోవద్దు.
ఏర్పాటు ఎలా?
అత్యవసర నిధి రాత్రికి రాత్రే ఏర్పాటు చేయడం కుదరదు. దీనికి ఎంతో క్రమశిక్షణ, అంకితభావం అవసరం. ఈ నిధిని ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. అయితే, ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఈ నిధికి మళ్లించడం ఒక్కటే తేలికైన మార్గం. మీరు అనుకున్న మొత్తాన్ని చేరుకునే వరకూ దీన్ని కొనసాగించాల్సిందే. ఇలా మిగిల్చిన మొత్తాన్ని ఎక్కడ మదుపు చేయాలన్నదీ ముఖ్యమే.
పొదుపు ఖాతా
బ్యాంకు పొదుపు ఖాతాలో అత్యవసర నిధిని జమ చేస్తూ వెళ్లడం ఒక రకంగా సురక్షితమే. పైగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకునే వెసులుబాటూ ఉంటుంది. కాస్త వడ్డీ అధికంగా ఇవ్వడం, తక్కువ కనీస నిల్వ ఉండటంలాంటి సౌకర్యాలున్న మంచి బ్యాంకును ఎంపిక చేసుకొని, పొదుపు ఖాతా ప్రారంభించండి. ప్రస్తుతం ఈ పొదుపు ఖాతాలపై బ్యాంకులను బట్టి, 2-7శాతం మధ్య వడ్డీ వస్తోంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు
అత్యవసర నిధిని కూడబెట్టడానికి అందుబాటులో ఉన్న మరో మార్గం ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ). బ్యాంకు లేదా కంపెనీలో నిర్ణీత వ్యవధికి ఒకేసారి మీ దగ్గరున్న మొత్తాన్ని ఫిక్స్‌డ్ చేయొచ్చు. ఈ వ్యవధిలో మీకు వడ్డీ జమవుతూ ఉంటుంది. వీటిలో బ్యాంకులు, వ్యవధులను బట్టి, 2-7శాతం వరకూ వార్షిక వడ్డీ లభిస్తోంది.
పొదుపు ఖాతాతో పోలిస్తే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మదుపు చేయడం ద్వారా అత్యవసర నిధికి కాస్త అధిక వడ్డీని ఆర్జించేందుకు వీలవుతుంది. బ్యాంకుల్లో స్వీప్-ఇన్ ఖాతాలూ అందుబాటులో ఉంటాయి. పొదుపు ఖాతాలో నిర్ణీత మొత్తం దాటగానే.. అధికంగా జమైన డబ్బు ఈ స్వీప్-ఇన్ ఖాతాలోకి వెళ్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎఫ్‌డీల నుంచి డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వీలున్నా.. కొంత అపరాధ రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఇది వడ్డీ రేటులో ఒక శాతం వరకూ ఉండవచ్చు.
లిక్విడ్ ఫండ్లు
స్వల్పకాలిక అవసరాల కోసం మదుపు చేసేందుకు లిక్విడ్ ఫండ్లు కొంత సురక్షితమే. ఇవి 91 రోజుల నుంచి దీర్గకాలం వరకూ అందుబాటులో ఉంటాయి. ప్రవేశ, అమ్మకపు రుసుములు ఉండవు. ఒక రోజులోనూ మీ పెట్టుబడిని వెనక్కి తీసుకునే వీలుంటుంది. బ్యాంకు ఎఫ్‌డీల్లాగా వీటిని నిర్ణీత కాలం కొనసాగించాలనే నిబంధనేమీ ఉండదు. బ్యాంకు ఎఫ్‌డీల కన్నా.. ఇవి 50-100 బేసిస్ పాయింట్ల మేరకు అధిక ఆదాయాన్ని అందించే అవకాశం ఉంటుంది. వీటిని అమ్మినప్పుడు వచ్చిన ఆదాయానికి నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి.
దీంతోపాటు.. అత్యవసర నిధిని జమ చేసేందుకు రికరింగ్ డిపాజిట్లనూ (ఆర్‌డీ) పరిశీలించవచ్చు. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఆర్‌డీ చేయొచ్చు. దీనిపైనా ఎఫ్‌డీ తరహాలోనే వడ్డీ అందుతుంది. ఎక్కడ మదుపు చేసినా.. కాస్త వైవిధ్యంగా ఉండటంతోపాటు, సులువుగా డబ్బును వెనక్కి తీసుకునేందుకు వీలుండటం మాత్రం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
రచయిత- అధిల్ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్.కామ్