దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లోని కుటుంబాల అప్పులు(Household Debt) గణనీయంగా పెరిగిపోయాయి. ఈ విషయం అఖిల భారత అప్పులు, పెట్టుబడుల సర్వే (ఏఐడీఐఎస్)(Aidis Survey) 2013-19 నివేదిక ద్వారా తెలిసింది. దక్షిణాది రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాల అప్పులు(Household Debt) కూడా అధికంగానే ఉన్నాయని వెల్లడైంది.
నివేదికలోని కీలక అంశాలు..
- 2019లో గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల అప్పుల్లో తెలంగాణ 67.2శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా.. నాగాలాండ్ 6.6శాతంతో చివరి స్థానంలో ఉంది.
- పట్టణ ప్రాంత అప్పుల్లో కేరళ 47.8శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. మేఘాలయ కేవలం 5.1శాతంతో చివరి స్థానంలో ఉంది.
- రాష్ట్రాల వారీగా.. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల అప్పుల్లో ఉత్తరాఖండ్ చివరిస్థానంలో ఉండగా.. పట్టణ ప్రాంత అప్పుల్లో ఛత్తీస్గఢ్ చివరి స్థానంలో ఉంది.
- అయితే.. రాష్ట్రాల తలసరి ఆదాయం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే అధికంగా ఉంది.
- ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణలో కుటుంబాల ఆస్తుల విలువ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. కుటుంబ ఆస్తుల విలువలో దేశీయ సగటు కంటే కర్ణాటకలో అధికంగా ఉంది.
దక్షిణాది రాష్ట్రాల్లోని కుటుంబాల్లో అప్పులు(Household Debt) అధికంగా ఉన్నప్పటికీ.. వారి ఆదాయ మార్గాలు కూడా అధికంగానే ఉన్నాయని ఏఐడీఐఎస్ పేర్కొంది. కరోనా ప్రభావంతో కుటుంబాల అప్పులు అధికమయ్యాయని తెలిపింది. కుటుంబాల అప్పుల విలువ దేశ జీడీపీలో 2020 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 33.8 శాతంగా ఉండగా.. 2021 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి 37.9శాతానికి పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇటీవలే వెల్లడించిన విషయాన్ని నివేదిక పేర్కొంది. వ్యయాన్ని పెంచుతూ ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పింది.
ఇదీ చూడండి: మరింత పెరగనున్న పెట్రో ధరలు.. ఇవే కారణాలు...