కరోనా నేపథ్యంలో పన్ను ఆదాయంపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టాలను భర్తీ చేసేలా పరిహారాన్ని చెల్లించే మార్గాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 40వ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. కేంద్ర, రాష్ట్ర ఆదాయాలపై కరోనా ప్రభావాన్ని పరిశీలించి లోటును తగ్గించే మార్గాలపై సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆలస్య రుసుముల మాఫీపైనా..
2017 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు జీఎస్టీ రిటర్నుల దాఖలులో ఆలస్య రుసుములు విధించటంపై చర్చించనుంది కౌన్సిల్. రిటర్న్‌లు దాఖలు చేయడానికి గడువు పొడిగించడం సహా వసూళ్లు తగ్గినందున ఏప్రిల్, మే నెలల జీఎస్టీ వసూళ్లను కేంద్రం వెల్లడించలేదు.
పరిహారం చెల్లించేందుకు మార్కెట్ నుంచి జీఎస్టీ కౌన్సిల్ రుణాలు తీసుకోవడంపై చట్టబద్ధతను కేంద్రం పరిశీలిస్తుందని గత కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ తెలిపారు.