భారత ఆర్థిక వృద్ధి 2019, 2020 సాధారణ వార్షిక సంవత్సరాల్లో 7.3 శాతంగా ఉండొచ్చని అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న రేటింగ్ ఏజన్సీ మూడీస్ అంచనా వేసింది.
ఇతర ఆసియా దేశాలతో పోల్చుకుంటే వర్తక వృద్ధిలో మందగమనం కారణంగా ఈ రెండేళ్లు దేశ ఆర్థిక వృద్ధి దాదాపు స్థిరంగా ఉంటుందని మూడీస్ 2019-2020 ప్రపంచ త్రైమాసిక ముఖ చిత్రంలో పేర్కొంది.
కేంద్ర గణాంకాల కార్యాలయం ఇటీవల వెల్లడించిన లెక్కల ప్రకారం 2019 మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనా 7 శాతంగా ఉంది. ఇది 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 0.2 శాతం తక్కువ.
కేంద్రం ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన రైతులకు నగదు బదిలీ పథకం, మధ్యతరగతి వర్గాలకు పన్ను మినహాయింపులు, జీడీపీ వృద్ధికి 0.45 శాతం మేర ప్రోత్సాహకాన్ని అందించవచ్చని మూడీస్ తెలిపింది.