కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి సీనియర్ ఆదాయపు పన్ను అధికారుల బృందం కీలక సూచనలు చేసింది. మధ్యకాలిక చర్యల్లో భాగంగా విదేశీ సంస్థలపై అధిక పన్ను విధించటం ద్వారా నగదు లభ్యత పెంచుకోవాలని సిఫార్సు చేసింది.
ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు ద్రవ్యోల్బణ ఆధారిత అలవెన్సులను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.37 వేల కోట్లు మిగులుతాయి. ఇలాంటివి మరికొన్ని చర్యలు చేపట్టాలని సూచించింది ఈ బృందం.
'ఫోర్స్' నివేదిక..
కరోనా మహమ్మారి ప్రతిస్పందన, ఆర్థిక ప్రత్యామ్నాయాలు (ఫోర్స్) పేరుతో ప్రభుత్వానికి నివేదికను అందించింది సీబీడీటీలోని భారత రెవెన్యూ సర్వీసెస్ సంఘం. కరోనా నేపథ్యంలో స్వల్పకాలిక (3 నుంచి 6 నెలలు) చర్యలు తీసుకోవాలని తెలిపింది.
- పన్ను మినహాయింపులు నిజాయతీగా చెల్లించేవారు, సమయానికి రిటర్నులు దాఖలు చేసేవారికి పరిమితం చేయాలి.
- రూ. కోటి పైగా ఆదాయం ఉన్నవారికి పన్ను శ్లాబును 30 నుంచి 40 శాతానికి పెంచాలి.
- రూ. 5 కోట్లు ఆదాయం ఉన్నవారికి సంపద సృష్టి పన్నును పునరుద్ధరించాలి.
- రూ. 1 కోటికిపైగా పన్ను చెల్లింపుదారులను సూపర్ రిచ్ (అధిక ధనవంతులు) జాబితాలో చేర్చాలి.
విదేశీ కంపెనీలపై..
మధ్యకాలిక (9- 12 నెలలు) చర్యల్లో భాగంగా దేశంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ కంపెనీలపై అదనపు భారం మోపాలన్నారు. రూ.1- 10 కోట్ల మధ్య ఉన్నవారిపై ప్రస్తుతం ఉన్న 2 శాతం సర్ఛార్జిని పెంచాలని సూచించారు. రూ.10 కోట్ల ఆదాయం దాటే వారిపై 5 శాతం సర్‌ఛార్జి వేయాలని సిఫార్సు చేశారు.
కొవిడ్ సెస్..
అదనపు రాబడి కోసం కొవిడ్- 19 రిలీఫ్ సెస్‌ను ప్రవేశపెట్టాలని సూచించారు ఐఆర్ఎస్ అధికారులు. ఈ సెస్ కింద ఒకేసారి 4 శాతం వసూలు చేయటం వల్ల మూలధన పెట్టుబడికి సాయం అందుతుందన్నారు. దీని వల్ల ప్రభుత్వం రూ.15 వేల నుంచి రూ.18 వేల కోట్ల వరకు సమీకరించగలదని అంచనా వేశారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ మద్దతు లేకుండా 'రిటైల్ పరిశ్రమ' మనుగడ కష్టమే!