దేశంలోని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) అధినేతలతో గురువారం సమావేశం కానున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. కొవిడి-19తో బ్యాంకులపై పెరిగిన ఒత్తిడిని తగ్గించేందుకు.. రుణాల పునర్వ్యవస్థీకరణను వేగంగా అమలు చేసే అంశంపై సమీక్షించనున్నారు మంత్రి.
గత నెలలో కార్పొరేట్, రిటైల్ రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు అనుమతించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రుణాల పునర్వ్యవస్థీకరణ, బోర్డు అనుమతులు తీసుకునే ప్రయత్నాలు చేపట్టాయి బ్యాంకులు.
రుణాల పునర్వ్యవస్థీకరణపై బ్యాంకుల సన్నద్ధతతో పాటు.. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ప్రకటించిన వివిధ పథకాల అమలుపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. అలాగే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్(ఈసీఎల్జీఎస్) సహా ఇతర కీలక అంశాలపై సమీక్షించనున్నారని పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: ఆవిష్కరణ సూచీలో తొలిసారి టాప్-50లో భారత్