పండుగ వాతావరణం.. అంటే ఖర్చుల్లో పెరుగుదల. వెరసి నెలవారీ బడ్జెట్‌లో ఏర్పడే లోటు. పండుగను ఆర్భాటంగా నిర్వహించేసి, తరువాత ఎదురయ్యే ఖాళీ బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్లను చూసుకుని ఉసూరుమంటుంటాం. అలాగని ఆనందాన్ని చంపేసుకుని ఉండటమూ కష్టమే. ఈ రెండూ కాకుండా మధ్యే మార్గంగా వేడుక నిర్వహించుకుంటూనే జేబుకు చిల్లు పడకుండా చూసుకునే మార్గాలను ఎంచుకోవచ్చు. అవేంటో ఓసారి పరిశీలిద్దామా!
బడ్జెట్ వేసుకోవాలి..
సాధారణంగా మనం వేసేది స్థూల బడ్జెట్ అంచనాలే. ఈ చిత్తు లెక్కలే వ్యయాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. కాబట్టి అంశాల వారీగా వివరణాత్మకమైన ఆదాయ వ్యయాల పట్టికను రూపొందించుకోవడం అవసరం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను పరిశీలిస్తే.. ఒక వ్యక్తి 'ఎక్స్' మొత్తం ఆదా చేసిన సొమ్మును పక్కనుంచారు అనుకుందాం. అతను వాటిలో ఆహారం, దుస్తులు, గృహాలంకరణ, బహుమతులు మొదలైన వాటికి ఎంత శాతం చొప్పున ఖర్చు చేయగలరో అంచనా వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా.. ఆ వ్యక్తి తాను ఖర్చు చేయాలనుకున్న మొత్తం, తన వ్యయ సామర్థ్యాల మధ్య భేదాన్ని గ్రహించవచ్చు. ఈ ప్రక్రియ వ్యక్తులకు వ్యయాన్ని అంచనా వేసుకోవడంలోనూ, వాటికనుగుణంగా ఖర్చు చేసుకోవడంలోనూ ముందు జాగ్రత్త చర్యగా తోడ్పడుతుంది. అలాగే కార్డును ఉపయోగించవచ్చనే అత్యుత్సాహంతో అనవసర ఖర్చులను ప్రోత్సహించే ప్రమాదముంది. ఇలాంటప్పుడు క్రెడిట్ కార్డును వినియోగించడమూ మానేయాలి.
లెక్క తీయాలి..
ఒక్కోసారి కొనుగోళ్లను నియంత్రించడం చాలా కష్టమనిపిస్తుంది. అలాంటి సమయంలో ఈ వ్యయ పరిశీలన వాటిని అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. మీ ఆర్థిక ప్రణాళికకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. నేడు మార్కెట్‌లో నగదు నిర్వహణ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లు మీ ఖర్చులను పైసాపైసా పరిశీలిస్తూ, మీ సొమ్మును ఆదా చేసుకోవడంలో సహకరిస్తాయి. మరికొన్ని యాప్‌లు సొంతంగా ప్రణాళికను రూపొందించుకునే వీలును కల్పిస్తాయి. ఫలితంగా ఖర్చులపై ఒక కన్నువేస్తూనే పండుగ పూట ఆనందంగా గడిపే వీలూ ఉంటుంది.
సొంతంగా తయారు చేయండి..
ఇప్పుడంతా 'మీరు సొంతంగా తయారు చేయండి (డీఐవై)' అనే మాటే ఎక్కువగా కనిపిస్తోంది. డీఐవై మీ ఖర్చులను నియంత్రించే మంత్రమే కాదు.. కేటాయించుకున్న బడ్జెట్‌కే పరిమితం చేస్తూ.. కుటుంబంలో సరదా, సంతోషాలనూ తెచ్చిపెట్టే సాధనం. వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీయడంలోనూ, కుటుంబాన్ని దగ్గరగా చేర్చడంలోనూ పండుగలే మంచి తరుణం. కాబట్టి ఫ్యాన్సీ అలంకరణల జోలికి పోకుండా సొంతంగా తయారు చేయడానికి ప్రయత్నించండి. వీటికి భావోద్వేగాలూ తోడవుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా జేబు ఖాళీ కాకుండా ఉంచే అతి తేలికైన విధానం కూడా. అలాగే పునర్వినియోగాన్నీ తక్కువగా అంచనా వేయాల్సిన పనీ లేదు. ఇలాంటి క్రియాత్మక ఆలోచనలు డబ్బు ఆదా చేయడం సహా.. పండుగ స్ఫూర్తినీ సజీవంగా ఉండేలా చేస్తాయి.
ఖర్చుల కోసం ఆదా
ఇది కొంచెం వింతగానే అనిపించవచ్చు.. నిజానికి ఇదో ప్రయోగాత్మక ఆలోచన. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలంటే ఇప్పటి నుంచే ఆదా చేయాలి. ఈ డబ్బు భవిష్యత్తులో పెద్ద పండుగలు/ అవసరాల సమయంలో ఉపయోగపడవచ్చు. 'మెరుగైన రేపటి కోసం ఇప్పటి నుంచే ఆదా చేయండి' అన్న పాత సామెతను ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. పండుగ వాతావారణం అంటేనే కుటుంబం, ప్రియమైన వ్యక్తులతో ఆనందంగా గడపటం. మీ అప్పులు, ఖర్చులు ఆ ఆనందాన్ని దోచేసేలా చేసుకోకండి. ముందు జాగ్రత్తగా ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోండి. పండుగ సమయంలో హద్దులేని వ్యయాల నుంచి దూరంగా ఉండండి. ఇది కొంచెం అయిష్టంగా అనిపించినప్పటికీ మీ వ్యయ ప్రణాళికలు, పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను అందిస్తాయి.
ఇదీ చదవండి:క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!