మునుపటి తరంతో పోలిస్తే.. నేటి తరం(మిలీనియల్స్, జనరేషన్ జెడ్) వారు తమ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఓ సర్వే కుండబద్దలు కొట్టింది. సరైన ఆర్థిక ప్రణాళికతో.. మెరుగైన పెట్టుబడి ప్రణాళికలతో, స్పష్టమైన ఆర్థిక లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే..
మనకు స్వాతంత్ర్యం సిద్ధించి 74 ఏళ్లు నిండాయి. భవిష్యత్తుపై సానుకూల ఆశతో 75వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత ఆర్థికపరమైన అంశాలపై భారత యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆర్థిక స్వేచ్ఛను సాధించడంపై వారి అవగాహనేంటి? వంటి అంశాలపై ప్రముఖ ఆన్‌లైన్ పెట్టుబడుల వేదిక 'గ్రో' ఓ సర్వే నిర్వహించింది. దీంట్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయని గ్రో సీఓఓ హర్ష జైన్ తెలిపారు.
పెట్టుబడులపై ఇప్పటి తరంలో గుణాత్మక మార్పు వచ్చిందని జైన్ తెలిపారు. యువత సంపద సృష్టిపై దృష్టి సారించారని పేర్కొన్నారు. ఆర్థిక స్వేచ్ఛను సాధించడం కోసం చాలా ఆసక్తిగా ఉన్నట్లు సర్వేలో తేలిందని వెల్లడించారు. పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తూ అవగాహన పెంచుకుంటున్నట్లు తేలిందన్నారు. 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల 20,000 మందిపై ఈ సర్వే నిర్వహించారు. ఆగస్టు తొలివారంలో ఈ సర్వే జరిగింది.
ఇదీ చదవండి: ఆర్థిక విషయాల్లో మిలీనియల్స్ చేయకూడని పొరపాట్లు ఇవే..
సర్వేలోని ఇతర కీలకాంశాలు...
మదుపు ప్రారంభించారు
సర్వేలో పాల్గొన్న వారిలో 79.3 శాతం మంది గత ఏడాది వ్యవధి నుంచే మదుపు చేయడం ప్రారంభించారు. 18.3 శాతం మంది గత మూడేళ్ల నుంచి పెట్టుబడులు పెడుతున్నారు. కేవలం 2.4 శాతం మంది మాత్రమే మూడేళ్ల క్రితం నుంచి మదుపు చేస్తున్నారు.
కరోనా ముందు నాటి కంటే ఎక్కువే
కరోనా రాకముందు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడే ఎక్కువ మొత్తంలో మదుపు చేయాలని నిర్ణయించుకున్నట్లు 40.2 శాతం మంది తెలిపారు. కరోనా వల్ల తమ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం లేదని 26.6 శాతం మంది పేర్కొన్నారు. ఆదాయం తగ్గడంతో మదుపు చేయడం కూడా తగ్గించామని 25.8 శాతం మంది తెలిపారు.
నిర్ణయాలపై వీరి ప్రభావమే ఎక్కువ
పెట్టుబడుల నిర్ణయాలను స్నేహితులు లేదా సహచరులే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్లు 30.6 శాతం మంది తెలిపారు. ఇక 27.4 శాతం మంది వార్తా సమాచారం నుంచి, 23.4 శాతం మంది సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితమవుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి 13.9 శాతం మంది, ఏజెంట్లు, సలహాదారుల దగ్గర నుంచి కేవలం 4.6 శాతం మంది మాత్రమే సలహాలు తీసుకుంటున్నారు.
మదుపు లక్ష్యం
భవిష్యత్తు ఖర్చులు, రిటైర్‌మెంట్ అనంతర జీవితమే లక్ష్యంగా సంపద సృష్టి కోసం మదుపు చేస్తున్నట్లు 59.8 శాతం మంది వెల్లడించడం విశేషం. 30.7 శాతం మంది వ్యక్తిగత లక్ష్యాలతో పాటు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా వచ్చే ఖర్చుల కోసం మదుపు చేస్తున్నామని తెలిపారు. 9.5 శాతం మంది పై చదువుల కోసం పెట్టుబడులు పెడుతున్నారు.
ఆర్థిక స్వాతంత్ర్యం అంటే
52.9 శాతం మంది తమతో పాటు తమ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ఆర్థిక స్వేచ్ఛ అని అభిప్రాయపడగా.. 37.3 శాతం మంది మాత్రం తమ జీవితాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకునే సామర్థ్యాన్ని సంపాదించడమే ఆర్థిక స్వాతంత్ర్యం అని తెలిపారు. ఇక 10 శాతం మంది.. త్వరగా రిటైర్ అయ్యేందుకు సరిపడా సంపదను పోగు చేసుకోవడమే ఆర్థిక స్వేచ్ఛ అని అభిప్రాయపడ్డారు.
అవగాహన లోపమే అసలు కారణం
ఆర్థికపరమైన అంశాలపై అవగాహన లేకపోవడమే తక్కువ మదుపు చేయడానికి ప్రధాన కారణమని సర్వేలో తేలింది. అలాగే పెట్టుబడుల నిర్ణయాల్లో నష్టభయం తప్పించుకోవడానికి అతిజాగ్రత్త వహించడం కూడా ఓ కారణమని తెలిసింది. అయితే, పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై మాత్రం ప్రతిఒక్కరూ సరైన అవగాహన ఏర్పరుచుకుంటున్నారని సర్వే తెలిపింది. తద్వారా భవిష్యత్తులో మెరుగైన నిర్ణయాల కోసం బాటలు వేసుకుంటున్నారని పేర్కొంది.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? ఈ విషయాలు తెలుసుకోండి..