దేశవ్యాప్తంగా లాక్డౌన్ సడలింపులు అమలైనప్పటికీ.. చాలా ప్రాంతాల్లో వస్త్ర దుకాణాలకు వెళ్లేందుకు వినియోగదారులు భయపడుతున్నారు. భౌతిక దూరం నిబంధనలు సహా ఆదాయ వనరులు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణం.
నిజానికి కరోనాకు ముందే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభం దిశగా పయణించాయి. కొవిడ్ ప్రభావంతో ఆ దేశాలు వేగంగా మాంద్యంలోకి జారుకున్నాయి. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మాస్క్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాస్క్ ఇప్పుడు మన జీవితాల్లో నిత్యావసరంగా మారిపోయింది.
ఈ పరిస్థితుల్లో వస్త్ర పరిశ్రమలు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు మాస్క్‌ల తయారీని ప్రారంభించాయి. ఇతర విభాగాల్లోని వస్త్రాలకు తగ్గిన డిమాండ్‌ను మాస్క్‌లతో భర్తీ చేసుకోవాలని భావిస్తున్నాయి.
మాస్క్‌ల తయారీలో దిగ్గజాలు..
కరోనా ప్రభావం ఏ ఒక్క బ్రాండ్‌కో పరిమితం కాలేదు. అన్ని బ్రాండ్లు ఈ సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీనితో డిమాండ్‌ను తిరిగి పెంచుకునేందుకు మాస్క్‌ల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాయి.
లూయిస్ ఫిలిప్, వ్యాన్ హుస్సేన్, అలెన్ సోలి, ప్యూమా, జాకీ, షాపర్స్ స్టాప్, ఎఫ్‌బీబీ ఇండియా, వైల్డ్ క్రాఫ్ట్ తదితర ప్రముఖ బ్రాండ్లు గత కొన్ని నెలల నుంచి మాస్క్‌లను విడుదల చేస్తున్నాయి.
ఫ్యాషన్ మాస్కులు..
ప్రస్తుతం మూడు రకాల మాస్క్‌లు మార్కెట్‌లో ఉన్నాయి.
గాలి ద్వారా వ్యాపించే ప్రమాదకర కణాలను అడ్డుకునేవి.. వాటి నుంచి రక్షణ కల్పించేవి ఎన్95 మాస్క్‌లు. కొద్ది పాటి సమయానికి వాడే డిస్పోజబుల్ సర్జికల్ మాస్క్‌లు రెండోరకం. వీటిని ఆస్పత్రుల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు.
ఇవి కాకుండా కాటన్‌తో తయారు చేసిన ఫ్యాషన్ మాస్క్‌లు కుడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుంపర్లను అడ్డుకునేందుకు ఉపయోగపడుతాయి. వీటిని సాధారణంగా అందరూ వినియోగిస్తారు.
మూడో రకం మాస్క్‌ల తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు తక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది. ముడిసరుకు కూడా ఎక్కువగా అవసరం ఉండదు. కేవలం దుస్తుల తయారీ ఉపయోగించే బట్టను ఉపయోగించుకోవచ్చు. ఈ కారణంగా ప్రముఖ కంపెనీలన్నీ ఈ రకమైన మాస్క్‌లను తయారీ చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి.
కొన్ని కంపెనీలు యాంటీ వైరల్ వస్త్రంతో మాస్కులను తయారు చేస్తున్నాయి. ఈ వరుసలో దేశీయ బ్రాండ్ పీటర్ ఇంగ్లాండ్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉన్న హైక్యూతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. హైక్యూకు చెందిన వైరోబ్లాక్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీని ఉపయోగించి యాంటీ వైరల్ మాస్క్‌లు తయారుచేయనుంది పీటర్ ఇంగ్లాండ్.
డిజైనర్ మాస్క్‌లు..
ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ డిజైనర్లు కూడా మాస్క్‌ల తయారీలో నిమగ్నమౌతున్నారు. బ్రాండింగ్ పెంచుకోవటం వల్ల కరోనా కష్టకాలంలో వ్యాపారాన్ని కొనసాగించుకునేందుకు ఇది వారికి ఉపయోగపడుతుంది.
మాస్కులను కేవలం రక్షణకు వాడే వస్త్రాలుగా కాకుండా.. ప్యాషన్‌నూ కలగలిపి తయారు చేస్తున్నారు డిజైనర్లు. భారత్‌లో మసాబా గుప్తా, అనిత డొంగ్రీ, పాయల్ సింగల్, నిత్యా బజాజ్, శివన్, నరేష్, మనీష్ త్రిపాఠీ లాంటి డిజైనర్లు ఆకట్టుకునే మాస్కులను విక్రయిస్తున్నారు.
లగ్జరీ మాస్క్‌లు..
ప్రస్తుతం జీవితాల్లో భాగమైన మాస్క్‌లను విక్రయించేందుకు నగల వ్యాపారులూ మొగ్గుచూపుతుండటం విశేషం. వారు బంగారం, వెండి తొడుగుల మాస్క్‌లను మార్కెట్లోకి తెస్తున్నారు. కొంత మంది వ్యాపారులు వజ్రాలు పొదిగిన మాస్క్‌లనూ తయారు చేస్తున్నారు. ధనవంతులు తమ స్టేటస్ చెప్పుకునేందుకు ఇలాంటి మాస్క్‌లను రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేస్తుండటం మరో విశేషం.
నిషేధం ఎత్తివేత..
మాస్కుల ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మే నెల ప్రారంభంలో ఎగుమతులపై విధించిన ఆంక్షలను సడలించింది. పట్టు, ఉన్ని ఇలా అన్ని రకాల నాన్-సర్జికల్, నాన్-మెడికల్ మాస్కులను వేరే దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతులు ఇచ్చింది.
మాస్క్‌ల డిమాండ్..
కరోనాకు ముందు 2019లో ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌మాస్క్‌లకు డిమాండ్ 1,460 కోట్లుగా ఉండేది. 2023 నాటికి ఇది డిమండ్ 3,336.1 కోట్లకు పెరగొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. మాస్క్‌లకు ఈ స్థాయి డిమాండ్ రావడం అనేది.. వస్త్ర పరిశ్రమలకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసియా నుంచే ఎక్కువగా ఫేస్‌మాస్క్‌లు సరఫరా అవుతుంటాయి. పెరగనున్న డిమాండ్‌తో ఆసియా దేశాలకే అధికంగా కలిసొచ్చే అంశమని అంటున్నారు.
ఇదీ చూడండి:మాంద్యం నుంచి భారత్ U-షేప్ రికవరీ.. ఇంతకీ U అంటే?