ఒక దేశం-ఒక పన్ను లక్ష్యసాధన కోసం వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ఎంతో ఉపయుక్తమైన విధానం. నిజానికి ఇది దేశ పరోక్షపన్నుల వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేసింది. ఆర్థికవ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు తెచ్చింది. పన్ను చెల్లింపు పద్ధతులు, వ్యాపారాల నిర్వహణ, రిటర్నుల సమర్పణ... అన్నింటినీ మార్చేసింది. పరిశ్రమలు, వినియోగదారులు, ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా జీఎస్టీ గడచిన మూడేళ్లలో పలు మార్పులకు గురైంది. గడచిన మూడేళ్లలో అమలు చేసిన సంస్కరణలు- విధివిధానాల సరళీకరణ, పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, పన్ను ఎగవేతల నిర్మూలన అంశాలకు దోహదం చేశాయి. జీఎస్టీ ప్రవేశపెట్టి జులై 2020 నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తాయి. భావజాలపరంగా వీటిని స్థూలంగా రెండు వాదాలుగా విభజించవచ్చు. ఒక వాదన ప్రకారం, ఇది అద్భుతమైన విజయం. రెండో వర్గం భావనలో జీఎస్టీ ఒక విధాన వైఫల్యం. జీఎస్టీ విజయాలను ఆందోళనకర పార్శాలను సరిగ్గా మదింపు వేయాలంటే- భావజాల దృక్కోణాలకు అతీతంగా ఈ అంశాన్ని పరిశీలించాలి. ప్రపంచ బ్యాంకు ప్రకటించే 'వ్యాపార నిర్వహణ సౌలభ్య' సూచీ ర్యాంకింగ్‌లో భారత్ విశేషరీతిలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఇది మరీ ముఖ్యం.
సమీక్షా సమయమిది!
జీఎస్టీ వంటి వ్యవస్థాగత సంస్కరణ, అది అమలు అవుతున్న తీరు... భారత్‌లో వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయనే దానిపై దీర్ఘకాలిక ప్రభావం కలిగి ఉంటాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకునే ప్రమాణాల్లో ఇది ముఖ్యమైందవుతుంది. చీకాకుల్లేని పారదర్శకమైన పన్నుల వ్యవస్థ ఉండాలని ప్రతి వ్యాపారీ కోరుకుంటాడు. కాబట్టే, భావజాల కోణాలకు అతీతంగా సమీక్షించుకోవలసిన విషయమిది. ఎన్డీయే పాలనలో అమలు చేసిన అతి భారీ సంస్కరణగా ప్రశంసలు పొందిన జీఎస్టీ... దేశంలో పన్నుల ప్రాతిపదిక(టాక్స్ బేస్)ను విస్తృతపరచడంలో విజయవంతమైంది. 2017 జులై ఒకటోతేదీన జీఎస్టీ అమలులోకి వచ్చిన తరవాత, 38 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఈ విధానంలోకి మారారు. అదే ఏడాది సెప్టెంబరు నాటికి వీరి సంఖ్య 64 లక్షలకు చేరింది. మరో 58 లక్షల మంది చేరికతో, ఈ సంఖ్య 90శాతం వృద్ధి చెందింది. వెరసి 2020 మార్చి 31 నాటికి దేశంలో 1.23 కోట్ల జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చైతన్యంగా ఉన్నాయి. ఇదే కాకుండా, ఈ కాలంలో రేట్లను హేతుబద్ధీకరించారు. వ్యవస్థను బలోపేతం చేసేందుకు వీలుగా ఈవే బిల్లులు, ఇ- ఇన్వాయిసింగ్ వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు. జీఎస్టీ వ్యవస్థ, దాంతో వచ్చిన గణాంక సేకరణ ప్రక్రియలు ఒక సంస్థ చేస్తున్న వాస్తవ వ్యాపారపు ఆనుపానులు తెలుసుకుని కచ్చితంగా దాన్ని మూల్యాంకన చేయగలవని అంచనా. చౌక వడ్డీలతో అధికారిక రుణాలను పొందే అవకాశాలు మెరుగవుతాయి. ఈ మధ్యనే ప్రవేశపెట్టిన ఇ-ఇన్వాయిసింగ్ డిజిటల్ ఆర్థికవ్యవస్థకు బలమైన చోదకం. ముఖ్యంగా ఎలెక్ట్రానిక్ పద్ధతిలో జరిగే బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) లావాదేవీలకు జీఎస్టీ నెట్‌వర్క్ ద్వారా ప్రామాణికత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో విధాన నిర్ణేతలు దృష్టి సారించాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయి.
ఫలితం దక్కాలంటే?
స్థూలస్థాయిలోని తొలి సమస్య... కేంద్రం రాష్ట్రాల నడుమ సమన్వయ సాధన కొన్ని సందర్భాల్లో రానురాను కష్టంగా మారడం. సహకార సమాఖ్యవాదం ప్రబోధించే నిజమైన స్ఫూర్తిని కాపాడేందుకు ఫలప్రదమైన ఒక సంవిధానం ఇప్పటి ప్రధాన ఆవశ్యకత. ఎప్పటికప్పుడు మారుతూ ఉండే జీఎస్టీ నిబంధనలకు వ్యక్తిగత సంస్థలు ముఖ్యంగా చిన్నతరహా సంస్థలు కట్టుబడి ఉండేలా చూడటం ఎలాగన్నది రెండో అంశం. ఈ క్రమంలో వాటికి ఎదురయ్యే సమస్యలు సంక్లిష్టతలను సమర్థంగా పరిష్కరించే యంత్రాంగం రూపొందాలి. ఉదాహరణకు జీఎస్టీ చెల్లింపుదారులు జీఎస్టీఆర్-1, జీఎస్టీఆర్-3బి, ఐటీసీ-04 (ఒకవేళ అవసరం అయితే) వంటి రిటర్నులు, ఫారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇ-ఇన్వాయిస్‌లు, ఇ-బిల్లులకు ఇవన్నీ తోడు కావడంతో వీటి పరిజ్ఞానం అంతగా ఉండని చిన్న సంస్థలు వృత్తి నిపుణులను ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి, ఈ తరహా ఫైలింగ్ నిబంధనలను మరింత సులభతరం చేయాలి. లేనట్లయితే అసలే అంతంతమాత్రంగా ఉండే లాభశాతం దెబ్బతింటుంది. వాస్తవానికి, కొవిడ్ మహమ్మారి సంక్షోభం సృష్టిస్తున్న నేపథ్యంలో- జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ నిబంధనల నిబద్ధతలో మరిన్ని సడలింపులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
పక్కా విధానాలు అవసరం
మూడో అంశం... క్లెయిముల రిఫండుకు సంబంధించిన ఇక్కట్లను పరిష్కరించడం. రిఫండ్‌లలో జాప్యం- మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లవుతుంది. సంస్థలు నిధుల కోసం మరింత కటకటలాడే పరిస్థితి రాకూడదు. మహమ్మారి దెబ్బ నుంచి వారు సత్వరం కోలుకోవాలంటే ఇలాంటి అవరోధాలను తొలగించాలి. ఎగుమతుల రంగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గిరాకీ సన్నగిల్లి విలవిల్లాడుతోంది. ఎగుమతిదారులు సత్వరం రిఫండ్ పొందేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. నకిలీ ఇన్‌వాయిస్‌లతో పన్ను ఎగవేయడమనే సమస్య నాలుగోది, అతి ముఖ్యమైంది. ఈ దిశగా 2020 అక్టోబరు ఒకటో తేదీన ప్రవేశపెట్టిన ఇ-ఇన్వాయిసింగ్ పద్ధతి సరైనదే అయినా దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అత్యధికశాతం పన్ను చెల్లింపుదారులు దీని పరిధిలోకి రారు. ఇది వర్తించే కనీస టర్నోవరు పరిమితిని రూ.500 కోట్లుగా నిర్ణయించడమే దీనిక్కారణం. నకిలీ ఇన్వాయిస్‌లతో ఇన్‌పుట్ పరపతి క్లెయిములు చేసుకునే అవకాశం యథాతథంగా కొనసాగుతుంది. మోసం జరిగాక మోసగాళ్ల వెంటబడే బదులు, మూలంలోనే పక్కా విధానాలు రూపొందించి అమలు చేయాలి. ఈ సమస్యలను పరిష్కరించినట్లయితే- జీఎస్టీ మరింత సమర్థంగా అమలై ఇప్పటికంటే మెరుగైన ఫలితాలిస్తుంది. వ్యాపారం చేయడం క్షేత్రస్థాయిలో మరింత సులభం అవుతుంది. పన్నుల ప్రాతిపదిక (టాక్స్ బేస్) విశాలమై పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఇతోధికమవుతుంది. వసూళ్లు గణనీయంగా పెరుగుతాయి. సరళమైన పరోక్షపన్నుల జమానా వల్ల 'వ్యాపార విశ్వాసం' సుదృఢమై ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటాయి. ఇప్పటి సంక్షోభ సమయంలో ఇది ఆర్థికవృద్ధికి ఉత్ప్రేరకం అవుతుంది.
(రచయిత- మహేంద్ర బాబు కురువ, హెచ్‌ఎన్‌బీ గఢ్వాల్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ డీన్)