కరోనా వైరస్‌కు వైద్యపరమైన పరిష్కారం లభించే వరకు.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు ఇండియా రేటింగ్స్ ప్రధాన ఆర్థికవేత్త సునీల్ సిన్హా. అప్పటి వరకు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు లాక్డౌన్ సడలించి ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్థిక, విధాన పరమైన సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వలేవన్నారు.
దాదాపు రెండు నెలల సంపూర్ణ లాక్డౌన్ అనంతరం దేశవ్యాప్తంగా ఇటీవలే సడలింపులు ఇచ్చింది కేంద్రం. లాక్డౌన్ సడలింపునకు ముందు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం 'ఆత్మ నిర్భర్ భారత్' పేరుతో రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ స్థాయిలో ఉద్దీపనలు ఇచ్చినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తొలగిపోదని సునీల్ సిన్హా లాంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
పరిమిత సంక్షోభం కాదు..
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం 2008, 2018-19 లాంటిది కాదని.. ఆర్థిక వ్యవస్థలో ఏదో ఒక రంగానికి ఇది పరిమితం కాలేదని పేర్కొన్నారు సునీల్ సిన్హా.
ఈ సంక్షోభ పరిస్థితులు ప్రధానంగా వైద్య కారణాలతో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వైద్య శాస్త్రంలోనే దీనికి పరిష్కారం లభించకపోతే.. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గనట్లేనని.. 'ఈటీవీ భారత్'తో చెప్పుకొచ్చారు సిన్హా. ఇలాంటి సమస్యలకు ఆర్థిక, విధాన పరమైన చర్యలు పరిష్కారం చూపలేవని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొన్ని రంగాలు తిరిగి కాస్త పుంజుకున్నా.. కరోనాకు వైద్యపరమైన పరిష్కారం లేనిదే సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదని అన్నారు.
అలా చేస్తే సంస్కరణలు వ్యర్థమే..
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనేందుకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కట్టడికి మళ్లీ లాక్డౌన్ విధించాలని కేంద్రం భావిస్తే.. ఆర్థిక ప్యాకేజీకి అర్థముండదన్నారు సునీల్ సిన్హా.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంకేతాలిచ్చినట్లుగానే.. మరో దశ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా.. వ్యాక్సిన్‌కు సంబంధించి పురోగతి లేకపోతే మాత్రం.. దానివల్ల కూడా ఫలితం ఉండదని అభిప్రాపడ్డారు సిన్హా.
శాస్త్రవేత్తలు సెప్టెంబర్‌లోపు వ్యాక్సిన్ కనుగొంటే.. అప్పుడే ప్రజలు తమ తమ విధులకు వెళ్లడం, పెట్టుబడులు పెరగటం వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు ఉంటాయని సునీల్ సిన్హా తెలిపారు.
ఇదీ చూడండి:'భారత్ గొప్ప శక్తిగా ఎదగడం ఖాయం'