బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న రుణ గ్రహీతలకు ఆర్థిక శాఖ పండుగ కానుక ఇచ్చింది. లాక్డౌన్ సమయంలో రుణ గ్రహీతలపై భారం తగ్గించేందుకు రుణాలపై ఆర్బీఐ విధించిన మారటోరియం కాలానికి.. వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మారటోరియం అందుబాటులో ఉన్నా లేకున్నా.. రూ.2 కోట్ల వరకు రుణంపై వడ్డీ మీద వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత మార్గదర్శకాలను విడుదల చేసింది ఆర్థిక శాఖ.
రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీ వీలైనంత త్వరగా చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు రుణాల విషయంలో వడ్డీపై వడ్డీ మాఫీ కానుంది.
మార్గదర్శకాలు ఇవి..
మారటోరియం కాలానికి.. సాధారణ వడ్డీ, వడ్డీపై వడ్డీ మధ్య తేడా నగదును.. బ్యాంకులు రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాలి. అలా చెల్లించిన మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. అయితే రుణ గ్రహీత ఖాతా ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి నిరర్ధక ఆస్తిగా ప్రకటించి ఉండకూడదు. అలాంటి రుణ గ్రహీతలకు మాత్రమే.. వడ్డీపై వడ్డీ మాఫీ వర్తిస్తుంది.
ఎలాంటి రుణాలకు వర్తిస్తుంది?
రూ.2 కోట్లు మించని గృహ, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డ్, వాహన రుణం, ఎంఎస్ఎంఈ రుణాలకు, కన్సూమర్ డ్యూరబుల్ రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఈ నిర్ణయంతో కేంద్రంపై రూ.6,500 కోట్ల భారం పడనుంది.
ఇదీ చూడండి:పండుగ సీజన్లో కొనుగోళ్లు.. ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?