రిటైల్ వ్యాపారులు, దుకాణదారులు, స్వయం ఉపాధిదారులకు పింఛను పథకాన్ని తీసుకువచ్చింది నూతన కేంద్ర ప్రభుత్వం. శుక్రవారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం లభించింది.
మరి ఈ పథకానికి అర్హులెవరు? పేర్లు ఎలా నమోదు చేసుకోవాలి? ప్రీమియం ఎంత? పూర్తి వివరాలు మీకోసం.
అర్హులు..అర్హతలు
18-40 ఏళ్ల వయస్సు.. జీఎస్టీ టర్నోవర్ రూ. 1.5 కోట్లలోపు ఉన్న దుకాణదారులు, రిటైల్ వ్యాపారులు, స్వయం ఉపాధిదారులు ఈ పథకానికి అర్హులు.
ప్రభుత్వం నిర్ణయించిన ప్రీమియం చెల్లించిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు కనీసం రూ. 3,000 పింఛను లభిస్తుంది.
ఎలా నమోదు చేసుకోవాలి?
పింఛనుకు అర్హులైన వారు.. దేశ వ్యాప్తంగా ఉన్న 3.25 లక్షల కామన్ సర్వీస్ కేంద్రాల్లో ఎక్కడైనా పేర్లు నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ తేదీ ఇంకా వెలువడాల్సి ఉంది.
ప్రీమియం ఎంత?
దరఖాస్తుదారు వయస్సు | ప్రీమియం (నెలకు) |
18 | 60 |
19 | 100 |
40 | 200 |
దరఖాస్తుదారు చెల్లించిన ప్రీమియం మొత్తానికి... సమాన మొత్తంలో ప్రభుత్వం కూడా వారి తరఫున జమచేస్తుంది.
ఎంత మందికి లబ్ధి..
దేశ వ్యాప్తంగా ప్రస్తుతానికి 3 కోట్ల మంది.. వచ్చే మూడేళ్లలో 5 కోట్ల మంది ఈ పథకంలో చేరతారని ప్రభుత్వం భావిస్తోంది.