కరోనా వల్ల తీవ్రంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. సోమవారం పద్దును పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ బడ్జెట్లో రైల్వే విభాగానికి కేటాయింపులు ఎలా ఉండనున్నాయి?
రైల్వేకు గతంలో వేరుగా బడ్జెట్ ఉండేది. ఇప్పుడు యూనియల్ బడ్జెట్లోనే రైల్వేకూ కేటాయింపులు జరగుతున్నాయి. భారీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు, సంరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి బడ్జెట్లో కేటాయింపులు భారీగా ఉండొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.
ఈ ఏడాది బడ్జెట్లో 3-5 శాతం కేటాయింపులు పెరగొచ్చని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. మొత్తం ఈ సారి రూ.80 వేల కోట్ల కేటాయింపులు ఉండొచ్చని భావిస్తోంది. నేషనల్ రైల్ ప్లాన్ 2024ను కూడా బడ్జెట్ పరిగణించే వీలుందని చెబుతోంది. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కూడా కేటాయింపుల పెరుగుదలకు కారణం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
హై స్పీడ్ రైలు మార్గాలు ఇవే..
'రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిన నేషనల్ రైల్ ప్లాన్ 2024' ప్రకారం.. 8 వేల కిలో మీటర్ల పొడవైన హై స్పీడ్ రైల్వే నెట్‌వర్క్‌ను 2051 నాటికి నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్-బెంగళూరు, పట్నా-గువాహటి, అమృత్సర్- జమ్ము, వారణాసి-పట్నా మార్గాలు ఉన్నాయి.
మరిన్ని ప్రైవేటు రైళ్లు?
పర్యటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు రైల్వే మౌలిక వసతులు పెంచేందుకు మరిన్ని ప్రైవేటు రైళ్లకు సీతారామన్ అవకాశం కల్పించొచ్చని నిపుణులు అంటున్నారు. రూ.13 వేల కోట్ల పెట్టుబడుల కోసం.. 151 ప్రైవేటు రైళ్లను, 12 క్లస్టర్లను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించినట్లు గుర్తు చేస్తున్నారు.
రక్షణ సదుపాయాల మెరుగుదల విషయంలో.. 'రాష్ట్రీయ సంరక్షణ కోష్' ద్వారా రైల్వే శాఖ రూ.20 వేల కోట్లు పొందే వీలుంది. ట్రాక్‌లపై ప్రమాదాల నివారణకు వచ్చే ఐదేళ్ల వరకు కనీసం 50 శాతం కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని బడ్జెట్ సంప్రదింపుల్లో రైల్వే శాఖ.. ఆర్థిక శాఖకు సూచించింది.
గ్రీన్ రైల్వే కోసం భారీ కేటాయింపులు..
2030 నాటికి భారత రైల్వేను 'గ్రీన్ రైల్వే'గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గత ఏడాది ప్రకటించారు. ఇందులో భాగంగా 7 వేల కిలోమీటర్ల మేర విద్యుదీకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని పరిగణించి.. బడ్జెట్ కేటాయింపులు పెంచే వీలుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ప్రాంతాలకు కిసాన్ రైళ్లు..
ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడం, ట్రాక్‌ల డబ్లింగ్ వంటివి లక్ష్యంగా పెట్టుకుంది. వీటన్నింటితో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు కిసాన్ రైళ్లను నడిపించే ప్రకటన కూడా చేయొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర బిహార్ మధ్య మాత్రమే కిసాన్ రైళ్లు నడుస్తున్నాయి.
ప్రయాణికులు కోరుతున్నదేమిటి?
కొత్త రైళ్లు, మైరుగైన మౌలిక వసతుల ద్వారా కేంద్రం రైల్వే ఆధునికీకరణపై దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే ప్రయాణికులకు మాత్రం ఛార్జీల తగ్గింపును కోరుతున్నారు.
'దేశ అభివృద్ధికి బుల్లెట్ రైళ్లు అవసరమే. కానీ అలాంటి రైళ్లలో ప్రయాణించలేని వారి సంగతేమిటి? ఇందుకోసం రైలు టికెట్ ధరలపై కేంద్రం మరోసారి పునరాలోచన చేయాలి.' అని ఓ రైలు ప్రయాణికుడు 'ఈటీవీ భారత్'తో అన్నారు
"కరోనా సమయంలో ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆయా రైళ్లలో ప్రయాణించేందుకు మా నుంచి భారీగా వసూలు చేసింది. ప్రభుత్వం మరిన్ని ప్రైవేటు రైళ్లను తెచ్చేందుకూ ప్రయత్నిస్తోంది. దీనివల్ల కార్పొరేట్లకు లబ్ధి చేకూరుతుంది తప్ప.. సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు."
- రైలు ప్రయాణికుడు
ఇదీ చూడండి:గృహ, పట్టణాభివృద్ధి రంగాలకు పెద్దపీట!