బడ్జెట్‌కు ముందు జరిపే అంతరంగ చర్చలు ముగిసిన నేపథ్యంలో అందరి కళ్లు ఫిబ్రవరి 1న రానున్న బడ్జెట్ పైనే ఉన్నాయి.
ఆర్థిక విధానం, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించే మౌలిక సదుపాయాల అభివృద్ధి, అడ్డంకులు లేని సులభతర వ్యాపారం లాంటి పలు విషయాలపై పలు సూచనలు పొందింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ. 2021-22 కేంద్ర బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 30న నిపుణులు, వ్యాపార ప్రముఖులు, అధికారులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు జరిపారు. కొవిడ్-19 ప్రభావంలో ఫిబ్రవరి 1న తాను ప్రవేశపెట్టనున్న 3వ బడ్జెట్ 'ఇంతకు ముందెన్నడూ లేనిది'గా ఉంటుందని నిర్మల ఇదివరకే తెలిపారు.
అన్ని అంశాలపై సమగ్ర సమచారం..
పన్నుల విధానంతో సహా ఆర్థిక రంగ, పెట్టుబడుల్లో ముఖ్యపాత్ర పోషించే పెట్టుబడి వాటాదారుల సమూహాలు అనేక సూచనలు చేశాయి. బాండ్ మార్కెట్లు, బీమా, మౌలిక సదుపాయాల వ్యయాలు, ఆరోగ్యం, విద్య బడ్జెట్, సామాజిక రక్షణ, నైపుణ్యం, నీటి సంరక్షణ, పరిరక్షణ, పారిశుద్ధ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యాపారం సులభతరంగా చేయడం, వివిధ ఉత్పత్తులకు అనుసంధాన పెట్టుబడులు, ఎగుమతులు, స్వదేశీ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్రభుత్వ రంగ వస్తూత్పత్తి డెలీవరీ విధానాలు, నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యరహిత ఇంధనాలు, వాహనాలు లాంటి అన్ని సమగ్ర విషయాలపై వివిధ వర్గాల నుంచి ఆర్థిక మంత్రిత్వశాఖ సమాచారాన్ని, సలహాలను, సిఫార్సులను తీసుకుంది.
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
వృద్ధికి కీలకంగా వ్యవహారించే మౌలిక సదుపాయాలపై 2022 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ దృష్టి సారిస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-21లో చాలా మంది ఆర్ధిక వేత్తలు ఆర్థిక వ్యవస్థ 7-9% కుదించవచ్చని అంచనా వేసినప్పటికీ, తర్వాత సంవత్సరంలో తక్కువ వ్యవధిలోనే రెండంకెల వృద్ధి నమోదు చేయాలని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తోంది.
కొవిడ్-19 వ్యాప్తితో భారత ఆర్థిక వ్యవస్థ సెప్టెంబర్ త్రైమాసికంలో 7.5% క్షీణించింది. అయితే డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్థిక వ్యవస్థలో స్వల్ప వృద్ధిని ఆర్థిక మంత్రిత్వశాఖ ఆశిస్తోంది.
ఇదీ చూడండి:దేశం ముంగిట సాంకేతిక విప్లవం!