కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ .. దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. రైతులు, గ్రామాల అభివృద్ధిపైనే ఈ బడ్జెట్ ప్రముఖంగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు.
'ఆర్థికమంత్రి ఈసారి బడ్జెట్‌ను ప్రత్యేక పరిస్థితుల్లో సమర్పించారు. ఇది దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆత్మనిర్భర్ సాధనపైనే ప్రధానంగా దృష్టిసారించింది. వృద్ధి, యువతకు కొత్త అవకాశాలు, మౌలికరంగం, జీవన సౌలభ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం సామాన్య ప్రజానీకంపై భారం వేస్తుందని నిపుణులు అంచనా వేశారు. కానీ మేం భారత్‌కు అనుకూలమైన బడ్జెట్‌తో ముందుకొచ్చాం. అన్ని విధాలుగా అభివృద్ధికి ఊతం ఇస్తూ..ఆరోగ్యం, సంపద వృద్ధికి దోహదం చేసేలా దీన్ని తీసుకువచ్చాం. దీనిలో మౌలిక వసతులకు పెద్దపీట వేశాం. ఈ బడ్జెట్ రైతుల ఆదాయం పెంపునకు దోహదం చేస్తుంది. గ్రామాలు, రైతులపైనే ఈ బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెట్టామని తాజా నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి' అని ప్రధాని మోదీ అన్నారు.
ఆత్మ నిర్భరతకు మార్గదర్శి: అమిత్ షా
బడ్జెట్ 2021-22ను 'ఆత్మ నిర్భర భారత్'కు మార్గదర్శిగా అభివర్ణించారు హోం మంత్రి అమిత్ షా. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు, భారత్‌ను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిపేందుకు ప్రధాన నిరేంద్ర మోదీ చేస్తున్న కృషికి ఇది మరింత బలం చేకూర్చినట్లు పేర్కొన్నారు.
వరుస ట్వీట్లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్ నిర్ణయాలపై ప్రశంసలు కరిపించారు షా.
బడ్జెట్లో కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించడంపై షా హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ను కరోనా విముక్తం చేయాలన్న మోదీ సంకల్పానికి ఈ నిధి నిదర్శనమన్నారు. ఇందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
స్వావలంబనకు పునాదులు: రాజ్‌నాథ్
బడ్జెట్ 2021-22 అపూర్వమైనదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇది సమగ్ర వృద్ధి, సంక్షేమానికి కొత్త శకం కాగలదని అన్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బడ్జెట్ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుందని, ఉద్యోగ, మౌలిక వసతుల కల్పనతో భారత్‌ను 'స్వావలంబన దేశం'గా మార్చేందుకు పునాదులు వేస్తుందని పేర్కొన్నారు రాజ్‌నాథ్. బడ్జెట్లో ప్రకటించిన వివిధ నిర్ణయాలు, పథకాలు.. రైతులు, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు.
రక్షణ బడ్జెట్‌ను రూ.4.78 లక్షల కోట్లకు (రూ.1.35 లక్షల కోట్ల మూలధన వ్యయాలతో కలిపి) పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు రాజ్‌నాథ్ సింగ్.
ఇదీ చూడండి:ఆరోగ్య రంగం హర్షం- నిరాశలో పర్యటకం!