దేశంలో కొవిడ్ రోజురోజుకు పెరుగుతుండడం వల్ల ఆర్థిక రికవరీ మందగించే అవకాశం ఉందని భావిస్తున్న ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాయి. స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడి రికవరీ నెమ్మదిస్తుందని అందుకే జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గిస్తున్నామని తెలిపాయి.
కరోనా మహమ్మారికి ముందు ఆర్థిక సంవత్సరాల్లో కూడా దేశ జీడీపీ తగ్గుతూ వచ్చింది. 2016-17లో 8.3 శాతం వృద్ధి నమోదు చేయగా.. 20017-18లో 6.8 శాతం, 2018-19లో 6.5 శాతం, 2019-20లో 4 శాతంగా నమోదైంది. 2020-21లో వృద్ధి 8.3 శాతం క్షీణించిందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పరిశోధన సంస్థలన్నీ భావిస్తున్నాయి. తాజాగా కొవిడ్ కేసులు రోజుకు రెండెన్నర లక్షలకు పైగా నమోదవుతున్నందున మళ్లీ అంచనాలు తగ్గుతున్నాయి.
అయితే జూన్ ఆఖరుకు సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే అభిప్రాయాన్ని యూబీఎస్ వ్యక్తం చేసింది. రిజర్వ్ బ్యాంక్ 10.5 శాతం, ఐఎంఎఫ్ 12.5 శాతం, ప్రపంచ బ్యాంక్ 10.1 శాతం వృద్ధి అంచనాలు వెలువరించాయి.
ఇదీ చూడండి: 'విద్యుత్ వాహనాల తయారీలో అగ్రగామిగా భారత్!'