పోస్టాఫీస్ పథకాలు సురక్షిత పెట్టుబడులుగా.. చాలా కాలం నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. సంప్రదాయ ఖాతాదారుల్లో చాలా మందికి వీటి గురించి అవగాహన ఉంటుంది. ఇవి ఆకర్షణీయ వడ్డీ రేట్లను కూడా అందిస్తున్నాయి. ప్రభుత్వమే వీటిని నిర్వహిస్తున్నందున్న వీటిపై ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంది.
నెలనెలా ఆదాయం కోరుకునే వారికి, సీనియర్ సిటిజన్లకు.. దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం రావాలనుకునే వారికి వేరువేరుగా.. పోస్టాఫీస్‌లో పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మంత్లీ ఇన్‌కం స్కీం..
కనీసం రూ.1500 పెట్టుబడితో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. సింగిల్ అకౌంట్ అయితే గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకు, ఉమ్మడి ఖాతా (జాయింట్ అకౌంట్) అయితే గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తారు.
ప్రస్తుతం 7.6 శాతం వార్షిక వడ్డీ వర్తింపుతో నెలనెలా ఖాతాలో జమచేస్తారు. దీని కాల పరిమితి ఐదేళ్లు.
ఖాతా ప్రారంభ సమయంలో లేదా తర్వాత ఎప్పుడైనా నామినీని ప్రతిపాదించవచ్చు. నామినీగా ఎవరినైనా ఎప్పుడైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు ఖాతాను బదిలీ చేసుకోవచ్చు.
డిపాజిట్ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేయాలనుకుంటే డిపాజిట్ మొత్తం సొమ్ము నుంచి 2 శాతం కోత విధిస్తారు. మూడు నుంచి ఐదేళ్ల మధ్య ఖాతాను మూసివేస్తే ఒక శాతం కోత పడుతుంది.
పోస్టాఫీస్ సేవింగ్స్ పథకం
కనీసం రూ. 500తో ఈ ఖాతా ప్రారంభించుకోవచ్చు. వ్యక్తిగతంగా లేక ఉమ్మడిగా ఈ ఖాతా తెరవచ్చు. ప్రస్తుతం దీనిపై 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. చెక్‌బుక్, ఏటీఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఇతర సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. రూ.50 వేల వడ్డీ వరకు ఎలాంటి పన్ను వర్తించదు.
5 సంవత్సరాల పోస్టాఫీస్ రికరంగ్ డిపాజిట్ అకౌంట్
పేరులో ఉన్నట్లుగానే ఈ రికరింగ్ డిపాజిట్ వ్యవధి ఐదేళ్లు. రూ.100 నుంచి మొదలుకుని నెలవారీగా డిపాజిట్ చేయొచ్చు. 5.8 శాతం వార్షికంగా వడ్డీ పొందొచ్చు. వడ్డీ అనేది త్రైమాసికంవారీగా కాంపౌండ్ అవుతుంది. 12 వాయిదాలు చెల్లించిన అనంతరం డిపాజిట్ మొత్తంలో 50 శాతంపై రుణం తీసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం(ఎస్సీఎస్ఎస్)
ఈ పథకం ద్వారా సంవత్సరానికి 7.40% వడ్డీ రేటు లభిస్తుంది. 5 ఏళ్ల కాల పరిమితి ఉంది. దీనిని మరో మూడేళ్ల వరకు పొడిగించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడానికి గరిష్ఠ పరిమితి రూ. 15 లక్షలు. త్రైమాసిక ప్రాతిపదికన అధిక స్థిర రాబడి, సాధారణ ఆదాయం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లకు ఈ పథకం సరిపోతుంది. ఎస్సీఎస్ఎస్లో పెట్టుబడులు 1961 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అర్హులు.
ఇదీ చదవండి:'ఆన్లైన్ షాపింగ్'లో అదనపు క్యాష్‌బ్యాక్.. ఎలాగంటే?