ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా చేస్తున్న 'లాగ్ అవుట్ సమ్మె'ను రెస్టారెంట్లు విరమించాయి. స్విగ్గీ, జొమాటో సహా పలు ఇతర సంస్థలతో జరిపిన చర్చలు సఫలమైనట్లు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది.
సమ్మె ఎందుకంటే...
వినియోగదారులను ఆకర్షించేందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు భారీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లకు వచ్చి తినేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఈ ఆఫర్ల కారణంగానే తమ సంప్రదాయ వ్యాపారం దెబ్బతింటోందని దేశవ్యాప్తంగా 1,200లకు పైగా రెస్టారెంట్లు ఫుడ్ డెలివరీ సంస్థలపై'లాగ్ అవుట్' సమ్మెకు దిగాయి.
దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, గోవా, పుణే, గురుగ్రామ్, వడోదర పట్టణాల్లో జొమాటో, ఈజీడిన్నర్, నియర్‌బై, మ్యాజిక్ పిన్, గౌర్మెట్ పాస్‌పోర్ట్ వంటి సంస్థలపై 'లాగ్ అవుట్' సమ్మె ప్రభావం అధికంగా పడింది.
చర్చ సాగిందిలా..
రెస్టారెంట్ల సమ్మెతో ఫుడ్ డెలివరీ సంస్థలు దిగొచ్చి... రెస్టారెంట్ల యాజమానులు, జాతీయ రెస్టారెంట్ ఆసోసియేషన్‌తో(ఎన్ఆర్ఏఐ) ఇటీవల రెండు రోజులపాటు చర్చలు జరిపాయి. డిస్కౌంట్ల అంశమే సమ్మెకు కారణమని రెస్టారెంట్ల తరఫున ఎన్ఆర్ఏఐ వాదించింది. ప్రత్యేక ఆఫర్లతో పాటు, ఫుడ్ డెలివరీ సంస్థలు పలు ప్యాకేజీలతో చందాదారులను సమకూర్చుకుంటున్నాయి. వారి నుంచి చందా తీసుకుని తక్కువ ధరకే ఫుడ్‌డెలివరీ చేస్తున్నాయి పలు సంస్థలు. అవి తీసుకునే సబ్‌స్క్రిప్షన్‌లో తమకు ఎలాంటి వాటా ఇవ్వడం లేదని తెలిపాయి రెస్టారెంట్లు.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ఫుడ్ డెలివరీ సంస్థలు తమ భారీ డిస్కౌంట్లను పునఃసమీక్షిస్తామని రెస్టారెంట్లకు హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా రెస్టారెంట్లు 'లాగ్ అవుట్ సమ్మె'ను విరమించాయి.
ఫుడ్ డెలివరీ సంస్థల తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు ఉన్న భారీ డిస్కౌంట్లకు బ్రేక్ పడనుంది.
ఇదీ చూడండి: ఐఆర్సీటీసీకి మరో రెండు తేజస్ రైళ్లు అప్పగింత!