అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేయటం కారణంగా ఐటీ కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల లాభాలు 0.80 శాతం మేర తగ్గే అవకాశం ఉన్నట్లు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిసెర్చ్ అంచనా వేసింది.
లాభాలు తగ్గినా.. ఆదాయం మాత్రం 7-8 శాతం పెరగొచ్చని నివేదిక పేర్కొంది. వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ సేవల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ కంపెనీల ఆదాయం 180 బిలియన్ డాలర్లకు చేరొచ్చని క్రిసిల్ నివేదిక తెలిపింది.
స్థానిక నియామకాల్లో పెరుగుదల కారణంగా ఐటీ పరిశ్రమల నిర్వహణ లాభాలు 0.30 శాతం నుంచి 0.80 శాతం తగ్గొచ్చని పేర్కొంది క్రిసిల్ నివేదిక.
లాభాల తగ్గుదలకు కారణాలు ఇవే
ఐటీ కంపెనీలు సిబ్బందిపైనే ఎక్కువగా ఆధారపడుతాయి. ఒక పనిని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ వంటి దేశాలు తక్కువ వేతనాలతో పూర్తి చేస్తాయి. ఫలితంగా అధిక లాభాలు గడించేవి. ఇటీవలి కాలంలో వేతనాల మధ్య వ్యత్యాసం తగ్గిన కారణంగా ఆ ప్రభావం లాభాలపై పడుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఐటీ కంపెనీలు సాధారణంగా వాటి వ్యయంలో 65 శాతం ఉద్యోగులపైనే కేటాయిస్తాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రథమ శ్రేణి ఉద్యోగులపై కేటాయించే మొత్తం 17 శాతం పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఈ పెరుగుదల 6 శాతంగ మాత్రమే.
ముఖ్యంగా 2017 నుంచి హెచ్-1బీ వీసాల్లో కఠినతర నిబంధనల కారణంగా దేశీయ ఐటీ రంగానికి సవాళ్లు మొదలయ్యాయి. ఎందుకంటే అమెరికా హెచ్-1బీ వీసాలకు భారత్ అతిపెద్ద వినియోగదారుగా ఉంది.
మొత్తం హెచ్-1బీ వీసాలు పొందేవారిలో 63 శాతం భారతీయులే. అంటే అమెరికాకు భారత ఐటీ ఉద్యోగుల డిమాండు ఎంతగా ఉందో ఆర్థం చేసుకోవచ్చు.
స్థానిక ఉద్యోగులతో పోలిస్తే భారతీయ ఐటీ ఉద్యోగులు 20 శాతం తక్కువ వేతనాలకు పని చేస్తారు. ఈ కారణంగా భారతీయ ఉద్యోగులవైపు ఎక్కువ మొగ్గు చూపుతుంటాయి అమెరికా కంపెనీలు.
ఇటీవలి కాలంలో హెచ్-1బీ వీసాల్లో పలు కీలక మార్పులు చేసింది అమెరికా. ముఖ్యంగా వీసా దరఖాస్తుదార్ల కనీస వేతనాన్ని పెంచడం సహా మొత్తం వీసాల సంఖ్యను తగ్గించడం వంటి చర్యలకు ఉపక్రమించింది. ఈ కారణగా దేశీయ ఐటీ ఉద్యోగులకు హెచ్1-బీ వీసాలు పొందటం క్లిష్టంగా మారింది.