ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరుకు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్ డోర్సీ భారీ విరాళం ప్రకటించారు. తన వ్యక్తిగత సంపదలో నుంచి 1 బిలియన్ డాలర్లు ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
డోర్సీకి చెందిన డిజిటల్ పేమెంట్స్ గ్రూప్ 'స్క్వేర్'లోని షేర్లను స్వచ్ఛంద సంస్థ 'స్టార్ట్ స్మాల్'కు బదిలీచేస్తున్నట్లు తెలిపారు. ఆయన సంపదలో ఇది సుమారు 28 శాతం మేర ఉంటుంది. కరోనాపై పోరు కోసం ఓ వ్యక్తి ఇంత భారీ మొత్తం ప్రకటించటం ఇదే తొలిసారి.
" కరోనాపై పోరుకు సాయం చేసేందుకు ఇది ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నా. జీవితం చాలా చిన్నది. ప్రజలకు సాయం చేసేందుకు మనం చేయగలిగినది ఈరోజే చేద్దాం. స్క్వేర్‌లో నేను చాలా సంపద కలిగి ఉన్నా. ఈ డబ్బు వల్ల కలిగే ప్రభావం దీర్ఘకాలికంగా ప్రజలకు సేవ చేయాలనుకునే మా రెండు సంస్థలకు ప్రయోజనం చేకూర్చాలి. "
- జాక్ డోర్సీ, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు.
వ్యాధి ప్రభావం తగ్గిన తర్వాత ఈ నిధులను బాలికల ఆరోగ్యం, విద్య, నిరుపేదల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు డోర్సీ. లారెన్ పావెల్ ప్రారంభించిన 'అమెరికా ఆహార నిధి'కి సంబంధించిన పత్రాన్ని తన ట్వీట్‌కు జత చేశారు డోర్సీ. ఆ నిధికి ఇప్పటికే లక్ష డాలర్లు సమకూరాయి.
ఇతర సంస్థలు కూడా..
కరోనా వైరస్‌పై పోరుకు ఇప్పటికే పలు సంస్థలు సాయం ప్రకటించాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 100 మిలియన్ డాలర్లును అమెరికాలోని అన్నార్తులకు ఆహారం అందించేందుకు సాయం చేశారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫండేషన్ ద్వారా పరిశోధనల కోసం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ 25 మిలియన్ డాలర్లు ప్రకటించారు. ఇదే నిధికి గత నెలలోనే గేట్స్ ఫౌండేషన్ 125 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది.
ఇదీ చూడండి: ఆ విషయంలోనూ చైనా తర్వాతే అమెరికా