సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్.. 'ఫ్లీట్స్' అనే ఒక కొత్త ఫీచర్‌ను భారత్‌లో పరీక్షించనున్నట్లు ప్రకటించింది. కొన్ని ట్వీట్లు 24 గంటల తర్వాత కనిపించకుండా ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది.
ఇప్పటికే బ్రెజిల్, ఇటలీలో ఫ్లీట్స్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులో తెచ్చింది ట్విట్టర్. భారత్‌లోనూ ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు రాబోయే రోజుల్లో వచ్చే అప్డేట్ వెర్షన్ ద్వారా ఈ ఫీచర్‌ను తీసుకురానుంది.
"భారత్ మాకు చాలా ముఖ్యమైన అతిపెద్ద మార్కెట్. వినియోగదారులు వేగంగా పెరుగుతున్నారు. అందుకే మేం భారత్‌లో ఫ్లీట్స్‌ను ప్రయోగాత్మకంగా విడుదల చేయనున్నాం. మేం ఎంచుకున్న మొదటి 3 దేశాల్లో భారత్ ఒకటి."
- ట్విట్టర్
వారిని దృష్టిలో పెట్టుకుని..
వినియోగదారులు తమ సొంత ప్రొఫైల్ పిక్చర్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఏదైనా సందేశం లేదా మీడియాను అప్లోడ్ చేసి పోస్ట్ చేయవచ్చని ట్విట్టర్ తెలిపింది. ఫ్లీట్స్ కేవలం ఫాలోవర్స్కే కనిపిస్తాయి. ఫ్లీట్స్‌ను ఎవరు చూశారో కూడా తెలుసుకోవచ్చని ట్విట్టర్ తెలిపింది.
ఏదైనా ట్వీట్ చేస్తే అది అందరికీ కనిపిస్తుందన్న భయంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నట్లు ట్విట్టర్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టా, స్నాప్‌చాట్ తరహాలో ఉండే ఫ్లీట్స్ అప్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది.
"బహిరంగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఇబ్బంది పడేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ పోస్టులు 24 గంటల తర్వాత మాయమవుతాయి. వీటికి రీట్వీట్లు, కామెంట్లు, లైకులు కొట్టే అవకాశం ఉండదు. ఫాలోవర్లకు మాత్రం వ్యక్తిగతంగా డైరెక్ట్ మెసేజ్ చేయవచ్చు. ఫ్లీట్స్‌కు రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది."
- ట్విట్టర్
పెరిగిన వినియోగం..
బ్రెజిల్లో ఫ్లీట్స్‌ను ప్రారంభించినప్పటి నుంచి వినియోగదారులు తమ ఆలోచనలను సౌకర్యవంతంగా పంచుకుంటున్నట్లు ట్విట్టర్ తెలిపింది. సాధారణంగా తక్కువగా వినియోగించేవారు కూడా ట్విట్టర్‌ను సంభాషణల కోసం విరివిగా ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.