ఈ నెల 16,17,18 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న 2,900 ఆంధ్రా బ్యాంక్ శాఖల్లోని ఖాతాలను యుబీఐలోకి విలీనం చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగం సిద్దం చేసింది. ఆంధ్రా బ్యాంక్ శాఖల్లో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 900, తెలంగాణలో 700 ఉన్నాయి.
'ఆంధ్రా బ్యాంక్‌కు వినియోగదారుల ఖాతాలు యూబీఐలో విలీనమైనా.. ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకు, బ్రాంచీలకు చెందిన కోడ్‌లు మాత్రమే మారతాయి. ఖాతాకు చెందిన చివరి తొమ్మిది అంకెల్లో ఎలాంటి మార్పు ఉండదు' అని ఆంధ్రా బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల చివరి వాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించారు.
ఆ మూడు రోజులు కార్డ్ సేవలకు అంతరాయం..
సాప్ట్‌వేర్ మార్పు ప్రక్రియ కొనసాగే ఈ మూడు రోజులు ఆంధ్రా బ్యాంక్ ఖాతాదారుల క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని యూబీఐ వెల్లడించింది. దీనిపై ఆంధ్రా బ్యాంక్ ఖాతాదారులకు ముందస్తు సమాచారం ఇవ్వనున్నట్లు పేర్కొంది.
5వ పెద్ద బ్యాంకుగా యూబీఐ..
దేశంలోని ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖలను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేసే కార్యక్రమం గతేడాది ఏప్రిల్ 1 నుంచి మొదలైంది. ఈ ప్రక్రియ పూర్తయితే 9,700 శాఖలతో, 13,500 ఏటీఎంలతో, 12 కోట్లకుపైగా ఖాతాదారులతో దేశంలో 5వ పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా యూబీఐ అవతరించనుంది.
ఇప్పటికే కార్పొరేషన్ బ్యాంక్‌కు చెందిన 2,400 శాఖల ఖాతాలను యూనియన్ బ్యాంకులో విలీనం చేసే ప్రక్రియ పూర్తయింది.
వాటికి ఛార్జీలు ఉండవు..
కార్పొరేషన్, ఆంధ్రా బ్యాంక్‌లకు చెందిన ఖాతాదారులు యూనియన్ బ్యాంకు ఏటీఎంల్లో లావాదేవీలు కొనసాగించినా.. ఎలాంటి రుసుములు ఉండవని యూబీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఎవరికైనా ఈ మూడు బ్యాంకుల్లో ఖాతాలు ఉండి.. ఒకే ఖాతాకు పరిమితం కావాలి అనుకుంటే.. వారికి అనుకూలమైన ఖాతాను ఉంచుకుని మిగిలిన రెండింటినీ రద్దు చేసుకోడానికి అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధిత బ్యాంకు శాఖలో దరఖాస్తు చేస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. కార్పొరేషన్, ఆంధ్రా బ్యాంకులకు చెందిన ఖాతాదారులు శాఖలకు వెళ్లిన సమయంలో వారి వద్ద ఉన్న పాత పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకుని.. వాటి స్థానంలో కొత్తవి ఉచితంగా ఇస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి:2020లో ఇళ్ల విక్రయాలు 37% డౌన్!