టర్మ్ బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీకు ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నాయా..? అని అడుగుతుంటారు. ఇలాంటి వ్యసనాలుంటే.. పాలసీదారుడికి కాస్త ఎక్కువగా రిస్క్ ఉంటుంది కాబట్టి, పాలసీ ఇచ్చే సమయంలో బీమా సంస్థలు జాగ్రత్తగా వ్యవహరిస్తాయి.
పాలసీ ప్రతిపాదిత పత్రం నింపేటప్పుడు ఈ అలవాట్లు ఉన్నాయని పేర్కొంటే.. వాటికి తగ్గట్లుగా కాస్త అధిక ప్రీమియం వసూలు చేస్తాయి బీమా సంస్థలు.
- గతంలో ఇలాంటి అలవాట్లు ఉండి, ఇప్పుడు వాటిని పూర్తిగా మానేసినా... బీమా సంస్థల నియమ నిబంధనలను బట్టి ప్రీమియం ఉంటుంది.
- గతంలో అలవాటు ఉండి, మూడేళ్ల క్రితం నుంచి ధూమపానానికి దూరంగా ఉంటే.. ఆ సందర్భాలలో బీమా సంస్థలు వారిని సాధారణ వ్యక్తులుగానే పరిగణించి ప్రీమియం వసూలు చేస్తున్నాయి.
- బీమా పాలసీ 25-30 ఏళ్లపాటు ఉంటుంది. ఈ మధ్యలో ధూమపానం, మద్యపానం, ఇతరత్రా కొత్త అలవాట్లు రావచ్చు. ఇలాంటప్పుడు బీమా సంస్థకు ఆ విషయాన్ని తెలియజేస్తే మంచిది. అప్పుడు పాలసీ నిబంధనలను బట్టి, కాస్త అధిక ప్రీమియం వసూలు చేసే ఆస్కారం ఉంది. అందుకు సిద్ధంగా ఉండాలి.
బీమాను ప్రమాదంలోకి నెట్టేయొద్దు..
ఒకవేళ పాలసీ తీసుకునేటప్పుడు ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉండి వాటిని దాచిపెట్టారనుకుందాం. పాలసీ క్లెయిం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విషయాలు తెలిస్తే ఎలా..? నిజాలు తెలిసి పరిహారం ఇవ్వకుండా తిరస్కరిస్తే మీకెంత కష్టం చెప్పండి..? అందుకే బీమా పాలసీ తీసుకునేటప్పుడే నిజాల్ని చెబితే మంచిది.
కాస్త ప్రీమియం అధికంగా ఉంటుందని.. మొత్తం బీమా పాలసీకే రక్షణ లేకుండా చేసుకోవడం సరికాదు.
ఇదీ చూడండి: ఆరోగ్య భారతం: కేరళ టాప్- ఏపీ నెం.2