సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో చెప్పిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు రికార్డు స్థాయి లాభాలు నమోదు చేశాయి. బుల్ జోరుతో నేటి ఒక్క సెషన్లోనే తిరిగి జీవనకాల గరిష్ఠాలకు చేరువయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,422 పాయింట్లు వృద్ధి చెందింది. 39,353 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 421 పాయింట్లు బలపడింది. 11,828 వద్ద సెషన్ ముగించింది.
ఇంట్రాడే సాగిందిలా
రికార్డు స్థాయిలో ప్రారంభమైన సెన్సెక్స్ ఆద్యంతం అదే జోరు కొనసాగించింది. ఇంట్రాడేలో 38,570 - 39,413 పాయింట్ల మధ్య కదలాడింది.
నిఫ్టీ 11,845 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 11,592 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
విశ్లేషణ
సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈ ప్రకటనలతో సుస్థిర ప్రభుత్వంపై ఆశలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా నిపుణుల అంచనాలను మించి లాభాలు నమోదయ్యాయి.
"కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నిర్ణయాత్మక విధానాలతో భూమి, కార్మిక సంస్కరణలు తెస్తుందని ఆశలు ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న పనుల్లో పురోగతితో పాటు బ్యాంకింగ్ రంగ పునర్ వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటుందనే అంచనాలతో మదుపరులు భారీగా కొనుగోళ్లకు దిగారు" అని మార్కెట్ నిపుణలు విశ్లేషించారు.
లాభనష్టాలు
ఇండస్ ఇండ్ బ్యాంకు అత్యధికంగా 8.64 శాతం లాభపడింది. ఎస్బీఐ 8.04 శాతం, టాటా మోటార్స్ 7.53 శాతం, ఎస్ బ్యాంకు, 6.79 శాతం, ఎల్ అండ్ టీ 6.55 శాతం, హెచ్డీఎఫ్సీ 6.20 శాతం లాభపడ్డాయి.
బజాజ్ ఆటో 1.18 శాతం, ఇన్ఫోసిస్ 0.19 శాతం నష్టాపోయాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో 28 షేర్లు లాభాల్లో ముగియగా... 2 షేర్లు నష్టాలు నమోదు చేశాయి.
50 షేర్ల నిఫ్టీ ప్యాక్‌లో 45 షేర్లు లాభాల్లో ముగియగా.. 5 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
రూపాయి ఉత్సాహం
నేటి ఇంట్రాడేలో రూపాయి 64 పైసలు బలపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 69.59కి చేరింది.
ముడి చమురు ప్రియం
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ నేడు 1.40 శాతం పెరిగింది. ఫలితంగా బ్యారెల్ ముడి చమురు ధర 72.61 డాలర్లకు చేరింది.