ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ వినియోగదార్లతో ఓ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 17 ప్రధాన శాఖల ఆధ్వర్యంలో 500 ప్రాంతాల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది."మెగా కస్టమర్ మీట్ " పేరుతో వచ్చే మంగళవారం జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు లక్ష మంది వినియోగదార్లను కలుసుకోవాలని భావిస్తోంది ఎస్బీఐ.
ఖాతాదారులు నేరుగా బ్యాంకు సిబ్బందితో వారి సమస్యల గురించి చర్చించవచ్చు. బ్యాంకు సేవలను మెరుగు పరిచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు అని ఎస్బీఐ పేర్కొంది.
సాధారణంగా బ్యాంకులో కలిసినప్పుడు సమస్యల గురించి చర్చించేంత సమయం ఉండకపోవచ్చని, అందుకే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపింది ఎస్బీఐ.
యోనో యాప్‌పై అవగాహన
దేశవ్యాప్తంగా హాజరయ్యే వినియోగదార్లతో బ్యాంకు అధికారిక యాప్ "యోనో"ను ఎలా ఉపయోగించాలి, దాని వల్ల లాభాలు ఏంటనే అనే అంశాలపై అవగాహన కల్పించనున్నారు బ్యాంకు సిబ్బంది.