తూర్పు తీరాన ఉన్న కేజీ-డీ6 బ్లాక్‌లో రెండో దఫాలో కనుగొన్న క్షేత్రాల నుంచి ఉత్పత్తి ప్రారంభాన్ని జూన్ చివరకు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ సంస్థ భాగస్వామి బీపీ పీఎల్‌సీ వాయిదా వేశాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల ప్రజల కదలికలు, వస్తు రవాణాపై ఆంక్షల నేపథ్యంలో, చమురు ఉత్పత్తులకు గిరాకీ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 26 డాలర్లుగా ఉంది. కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్-సిరీస్ క్షేత్రంలో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్ ఉత్పత్తికి 2.2 డాలర్ల ఖర్చు అవుతుంది. ఓఎన్‌జీసీ క్షేత్రాలకు ప్రభుత్వం నిర్దేశించిన 2.39 డాలర్ల కంటే ఇది తక్కువ. కేజీ-డీ- బ్లాక్‌లో మూడు ప్రాజెక్ట్‌లపై పనిచేస్తున్నామని, ఇక్కడ 3 పాత క్షేత్రాల్లో ఉత్పత్తిని ఫిబ్రవరి నుంచి నిలిపివేసినట్లు నాలుగో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఆర్-క్లస్టర్ క్షేత్రం నుంచి మొదటి గ్యాస్ ఉత్పత్తి జూన్‌కు రావొచ్చని, లాక్‌డౌన్ తొలగింపుపై ఇది ఆధారపడి ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
వాస్తవానికి ఈ క్షేత్రంలో మే మధ్యనాటికే గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉంది. మొత్తం మూడు ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే.. 2023-24 నాటికి రోజుకు దాదాపు 28 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గరిష్ఠ ఉత్పత్తి ఇక్కడ సాధించగలమని సంస్థ అంచనా వేస్తోంది. కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్-క్లస్టర్, శాటిలైట్స్, ఎంజే పేరుతో మూడు క్షేత్రాలను రిలయన్స్, బీపీ 2022 నాటికి అభివృద్ధి చేయనున్నాయి.