పారిశ్రమిక దిగ్గజం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం 12వ తేదీన జరగునుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీపై అటు మార్కెట్ వర్గాల్లో.. ఇటు జియో ప్రేమికుల్లో భారీ అంచనాలున్నాయి. జియో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన 'గిగా ఫైబర్' సేవల ప్రారంభం, 'జియో ఫోన్-3' పై స్పష్టత వచ్చే అవకాశముండటమే ఇందుకు ప్రధాన కారణం.
గత ఏడాదే ప్రకటన
జియో నుంచి గిగా ఫైబర్ పేరుతో అంతర్జాల సేవలు ప్రారంభించనున్నట్లు గత ఏడాది వార్షిక సర్వ సభ్య సమావేశంలో రిలయన్స్ ప్రకటించింది. తక్షణమే దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లో గిగాఫైబర్ కోసం నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయా పట్టణాల్లో సంస్థ ఉద్యోగులతో ట్రయల్ నిర్వహిస్తోంది రిలయన్స్.
సంస్థ త్రైమాసిక ఫలితల ప్రకటనలో భాగంగా.. గిగా ఫైబర్ బీటా ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నట్లు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో 'గిగాఫైబర్' సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయనే అంచనాలు ఊపందుకున్నాయి.
గిగా ఫైబర్ ప్లాన్లు ఇలా..
ట్రయల్ దశలో పలు పట్టణాల్లో రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో 'గిగాఫైబర్' సేవలను అందిస్తోంది రిలయన్స్. 'ట్రిపుల్ ప్లే' ప్లాన్‌తో పేరుతో అందిస్తున్న.. ఈ ఆఫర్‌ను మొదట రిలయన్స్ ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేసినా.. తర్వాత బీటా టెస్టింగ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్. 'ట్రిపుల్ ప్లే' ప్లాన్‌లోని వినియోగదారులు డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ మూడు సేవలను పొందుతున్నారు. రూ.2,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో ఉన్న ప్లాన్ ద్వారా 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో గిగా ఫైబర్ సేవలను అందిస్తోంది.
పూర్తి స్థాయిలో 'గిగాఫైబర్' సేవలు ప్రారంభమైతే మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశముంది.
జియో నుంచి మరో ఫోన్
రిలయన్స్ ఇప్పటికే జియో ఫోన్-1, జియో ఫోన్-2 పేరిట రెండు ఫీచర్ ఫోన్లను తీసుకువచ్చింది. ఈ శ్రేణిలో ఇప్పుడు ఓ స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలేవీ రిలయన్స్ వెల్లడించలేదు. అయినప్పటికీ జియో ఫోన్-3 పేరుతో ఈ కొత్త ఫోన్ రానున్నట్లు మార్కెట్లో పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రిలయన్స్ సర్వ సభ్య సమావేశంలో దీనిపైనా స్పష్టత రానుంది.
ఇదీ చూడండి: జియో ఫోన్‌పై అంచనాలు ఇవే..