చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో 2020 లాభాలు దాదాపు సగానికి పడిపోయి 49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో చమురు ధరలు, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. 2019, డిసెంబరులో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన తర్వాత సౌదీ అరామ్‌కో ప్రకటించిన రెండో వార్షిక ఫలితాలు ఇవి. 2018లో అరామ్‌కో 111.2 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించగా.. 2019లో అది 88.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక 2020లో మరింత క్షీణించి 49 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
ముందు ప్రకటించినట్లుగా తమ కంపెనీ వాటాదార్లకు అయిదేళ్లపాటు ఏడాదికి 75 బిలియన్ డాలర్ల చొప్పున డివిడెండు చెల్లిస్తామని తెలిపింది. అయితే ఈ ఆదాయంలో చాలా వరకు సౌదీ ప్రభుత్వానికే వెళ్లనుంది. ఎందుకంటే కంపెనీలో 98 శాతం వాటాలు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి.
కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా రవాణా స్తంభించిపోయింది. దీనితో చమురు గిరాకీ తగ్గి ధరలు 30 ఏళ్ల కనిష్ఠానికి పతనమయ్యాయి. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, లాక్‌డౌన్ ముగియడం వల్ల అంతర్జాతీయంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చమురు గిరాకీ పుంజుకుంది. రవాణా సదుపాయాలను పునరుద్ధరించారు. దీనితో చమురు ధరలు మరోసారి పెరుగుతున్నాయి.
ఇదీ చదవండి:టెలికాం ఛార్జీల పెంపు ఇప్పట్లో లేనట్లే!