దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం సానుకూలంగా ట్రేడయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, సోమవారం వెలువడనున్న హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలపై మదుపరులు దృష్టి సారించే అవకాశముందంటున్నారు. అయితే వృద్ధికి ప్రోత్సాహమందించే దిశగా ప్రభుత్వ ప్రకటించిన ఉద్దీపనలతో మదుపరుల సెంటిమెంట్ బలపడొచ్చని విశ్లేషిస్తున్నారు.
వృద్ధి మందగమనం నేపథ్యంలో ఎగుమతి రంగం, స్థిరాస్తి రంగాలకు రూ.70,000 కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బ్యాంకుల నుంచి రుణ సదుపాయాన్ని పెంచేందుకు హామీ ఇచ్చారు. ఈ అంశాలు పెట్టుబడులకు సానుకూలతలు పెంచొచ్చని అంటున్నారు స్టాక్ బ్రోకర్లు.
డ్రోన్ దాడి ప్రభావం...
దేశీయంగా సానుకూలతలున్నప్పటికీ.. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ.. సౌదీలోని ఆరామ్కో శుద్ధికేంద్రంపై యమన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు డ్రోన్‌తో దాడి చేయడం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాడి నేపథ్యంలో ఇక్కడ శుద్ధి ప్రక్రియ పెద్దఎత్తున నిలిచిపోయింది. ఇది చమురు ధరలపై ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా మార్కెట్లపై కాస్త ప్రతికూల ప్రభావం ఉండొచ్చని అంటున్నారు.
'యుద్ధానికి తెర'పై ఆశలు...
సుంకాల యుద్ధం ముగింపు దిశగా అమెరికా-చైనా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని అమెరికా దిగుమతులపై అదనపు సుంకాలు ఎత్తేసేందుకు చైనా సానుకూలంగా స్పందించింది . చైనా దిగుమతులపై అధిక సుంకాల వడ్డనను అమెరికా వాయిదా వేసింది. ఇరు దేశాల మధ్య ఈ వారం జరగనున్న చర్చలు సఫలమైతే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు మరింత ముందుకెళ్తాయని నిపుణులు అంటున్నారు.
ఇదీ చూడండి: టీవీ బిల్లు ఇక మరింత చౌక.. ట్రాయ్ ప్రకటన!