ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు (LIC IPO update) సంబంధించి మరో కీలక అప్డేట్ వెలువడింది. నవంబర్‌లోపు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ'కి ఎల్‌ఐసీ ఐపీఓ కోసం దరఖాస్తు (డీఆర్‌హెచ్‌పీ) చేసుకునే (LIC IPO DRHP) వీలుందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
'ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసీ ఐపీఓ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా నవంబర్‌లోపు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసే అవకాశాలున్నాయి' అని ఆర్థిక శాఖ ఉన్నాతాధికారి పేర్కొన్నారు.
ఐపీఓను నిర్వహించే బ్యాంకులు ఇవే..
ఎల్‌ఐసీ ఐపీఓ కోసం ప్రభుత్వం గత నెలలోనే పది మర్చెంట్ బ్యాంకర్లను నియమించింది. గోల్డ్‌మన్ శాక్స్ (ఇండియా) సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నోమురా ఫినాన్షియల్ అడ్వైసరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఐపీఓను నిర్వహించనున్నాయి.
ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్, జేఎం ఫినాన్షియల్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కో లిమిటెడ్ ప్రభుత్వం ఎంపిక చేసిన బ్యాంకుల జాబితాలో ఉన్నాయి.
సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ ఎల్‌ఐసీ ఐపీఓకు న్యాయ సలహాదారుగా వ్యవహరించనుంది.
ఐపీఓ కోసం సెబీకి ఎల్‌ఐసీ దరఖాస్తు చేసుకుంటే.. మర్చెంట్ బ్యాంకర్లు అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రచారం ప్రారంభిస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
ఐపీఓపై మదుపరుల్లో ఆసక్తి..
'ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్‌ఐసీ ఐపీఓకు వస్తే.. భారీ స్పందన కచ్చితంగా ఉంటుంది. సంస్థాగత మదుపరులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రజల్లోనూ ఈ సంస్థపై విశ్వాసం ఎక్కువే. ఐపీఓకు దరఖాస్తు చేయడం కోసం మార్కెట్లో ఇతర కంపెనీల షేర్లలో ఉన్న డబ్బు ఉపసంహరించుకుని, ఎల్‌ఐసీ ఇష్యూకు దరఖాస్తుకు కేటాయించే అవకాశాలూ లేకపోలేదు' అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎల్‌ఐసీ ఐపీఓ ఎందుకు?
ప్రభుత్వ సంస్థల నుంచి రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా.. ఎల్ఐసీని ఐపీఓకు తీసుకరావాలని కేంద్రం నిర్ణయించింది. రెండు దశల్లో మొత్తం 10 శాతం వాటను ఐపీఓ ద్వారా విక్రయించే వీలుందని అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ ఐపీఓకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు లభించాయి.
ఎల్‌ఐసీ ఐపీఓ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిపోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లిస్టింగ్ తర్వాత అతిపెద్ద కంపెనీ కూడా ఇదే కానుందని తెలుస్తోంది.
ఇవీ చదవండి: