LIC IPO Launch Date: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఐపీఓ ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే సూచనలు కనిపించడం లేదని అధికారిక వర్గాలను పేర్కొంటూ వచ్చిన వార్తల్ని ప్రభుత్వం ఖండించింది. వచ్చే త్రైమాసికంలో సంస్థ పబ్లిక్ ఇష్యూను ప్రారంభించేందుకు చేస్తున్న ప్రణాళికలు కొనసాగుతున్నాయని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. అంతకుముందు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొంతమంది అధికారులు సంస్థ విలువను అంచనా వేయడం ఆలస్యమవుతోందని.. ఈ నేపథ్యంలో ఐపీఓ ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు.
LIC IPO News: సంస్థ పరిమాణం, అందిస్తున్న పాలసీలు, స్థిరాస్తులు, అనుబంధ సంస్థల వంటి కారణంగా ఎల్‌ఐసీ విలువను అంచనా వేయడం సంక్లిష్టంగా మారిందని మరో మర్చంట్ బ్యాంకర్ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప విక్రయించాల్సిన షేర్ల సంఖ్యను నిర్ణయించలేమని తెలిపారు. ఒకవేళ ఇది పూర్తయిన మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ, బీమా నియంత్రణా సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అనుమతులు రావడానికి మరింత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా నిర్దేశించిన ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి ఐపీఓకి రావడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
LIC IPO Size: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరేందుకు ఎల్‌ఐసీ ఐపీఓని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇందులో భాగంగా రూ.25,000 కోట్లను సమీకరించేందుకు రూ.10 ముఖ విలువతో 2,500 కోట్ల షేర్లను ఎల్‌ఐసీ జారీ చేయనుందని సమాచారం. ఒకసారి మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ.8-10 లక్షల కోట్ల విలువైన కంపెనీగా అవతరించనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థ నిర్వహణలో ప్రస్తుతం దాదాపు రూ.32 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది.
ఇదీ చూడండి: Sbi 3 In 1 Account: ఎస్‌బీఐ 3-ఇన్-1 ఖాతా- ఫీచర్లు ఇవే..