'ఎల్జీ' ఈ సంస్థ పేరు వింటే చాలా మందికి.. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు తయారు చేసే సంస్థ గుర్తొస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ ఇప్పుడు మరో సరికొత్త సాంకేతికతతో గృహోపకరణాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బట్టలు ఉతికేందుకు, ఆహార పదార్థాలను తాజాగా ఉంచేందుకు ఉపకరణాలను కలిగి ఉన్న ఎల్జీ తాజాగా... ఇంట్లోనే కూరగాయలు పండించుకునేందుకు వీలుగా ఓ ఉపకరణాన్ని రూపొందిస్తోంది. 2020లో జరగనున్న 'కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో'లో ఈ కొత్త గృహోపకరణాన్ని ప్రదర్శించనుంది ఎల్జీ.
ఈ కొత్త ఉత్పత్తికి ఏం పేరుపెట్టారనే విషయం వెల్లడించలేదు ఎల్జీ. అయితే ఈ కొత్త డివైజ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండనున్నాయనే విషయాన్ని లీక్ చేసింది.
కొత్త పరికరం వెల్లడించనందున ప్రస్తుతానికి ఎల్జీ 'వెజ్జీ' అనే పేరుతో పిలుస్తున్నట్లు ఎల్జీ వర్గాలు వెల్లడించాయి. వారి ప్రకారం.. రానురాను పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వెజ్జీలో కూరగాయలు పండించేందుకు సరిపోయే మాడ్యులార్ విధానం ఉంటుంది. కూరగాయలు పండించేందుకు బయట వాతావరణ పరిస్థితులను ప్రతిబింబించేలా ఇన్సులేటెడ్ క్యాబిన్ ఉండనుంది. విత్తనాలు మొలకెత్తేందుకు ఎల్జీ వెజ్జీలో ఎల్ఈడీ లైట్లు, బలవంతంగా గాలి ప్రసరణ విక్ ఆధారిత నీటిసరఫరా వ్యవస్థలు ఉండనున్నాయి. వీటి ద్వారా కావాల్సిన కూరగాయలను ఇంట్లోనే పండించుకనే వీలుకలగనుంది.
ఇదీ చూడండి:రివ్యూ 2019: ఏడాదిలో ఇంత డేటా వాడేశామా!