High Court On Ramanthapur Pedda Cheruvu : రామాంతపూర్ పెద్దచెరువు ఎఫ్టీఎల్‌ను 6 నెలల్లో నిర్ధారించి తుది నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనధికార ప్రతివాదుల అభ్యంతరాలనూ స్వీకరించాలని స్పష్టం చేసింది. తుది నోటిఫికేషన్ తర్వాత అక్రమ నిర్మాణం అని తేలితే తొలగించడంతో పాటు చెరువు చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. 2005 నాటి పిటిషన్‌పై ఈ కీలక ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ముగించింది.
హైదరాబాద్‌ని 532 చెరువులు క్రమేపీ క్షీణిస్తున్నాయని, 26 ఎకరాల్లోని రామంతాపూర్ పెద్దచెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని దీంతో నీటికాలుష్యం పెరిగి దుర్వాసన వస్తోందని ఉస్మానియా ప్రొఫెసర్ డా. కెఎల్ వ్యాస్ 2005 లో రాసిన లేఖను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 153 మంది ప్రతివాదులుగా ఉన్న ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. నీటివనరులపై పిటిషన్లు పెరుగుతున్నాయని, చెరువుల ఆక్రమణలు, కాలుష్యం వంటి సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది.
ఎఫ్టీఎల్‌ను నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్ ఇచ్చారా? : అంతకుముందు ప్రతివాదుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, 'గతేడాది అక్టోబర్‌లో చెరువు ఎఫ్‌టీఎల్ 17.23 ఎకరాలను అధికారులు నివేదిక అందజేశారు. చుట్టూ కంచెతోపాటు పచ్చదనం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఫొటోలనూ న్యాయస్థానానికి సమర్పించారని పెద్దచెరువు నుంచే జాతీయ రహదారిని నిర్మించినా ఎంత మేరకు పోయిందో అంచనా వేయలేదన్నారు. చెరువును చెత్తతో నింపడంతో విస్తీర్ణం కుంచించుకుపోయిందని, సర్వేనంబర్లు లేకుండా చెరువు వివరాలను కోర్టుకు సమర్పించారని ప్రతివాదుల తరఫు న్యాయవాదులన్నారు. దీనిపై సీజే జోక్యం చేసుకుంటూ, ఎఫ్టీఎల్‌ను నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు.
ఇంకా ఇవ్వలేదని, అయితే గత అక్టోబర్‌లో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని వివరాలకు కట్టుబడి ఉన్నామని అధికారులు చెప్పారన్నారు. రూ.10 కోట్లు ఖర్చు చేసి మార్కింగ్ చేశామన్నారు. ట్యాంక్‌బండ్ నిర్మాణం చేపట్టామనీ చెప్పారు. చెరువు పరిసరాల్లో భూగర్భజలాలను పెంచడానికి అప్పట్లో చెరువును నిర్మించారని, ఎఫ్‌టీఎల్‌పై తుది నోటిఫికేషన్ జారీ చేయలేదని, ఎప్పుడు కట్టినా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే అక్రమమేనని హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
గత అక్టోబర్ 11 జారీ చేసింది ఎఫ్‌టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమేనని తుది నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు. దుర్గం చెరువుకు ఇచ్చిన ఆదేశాలను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం పై ఆదేశాలు ఇస్తూ విచారణను ముగించింది. నీటివనరులపై పిటిషన్లు పెరుగుతున్నాయని, చెరువుల ఆక్రమణలు, కాలుష్యం వంటి సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది.
దుర్గం చెరువు ఎఫ్టీఎల్‌ను 6 వారాల్లో నిర్ధారించాలి : హైకోర్టు - Durgam Cheruvu FTL Issue in hc