Chakali Ilamma Jayanthi Celebrations 2024 : రజాకార్ల నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఐలమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనసభ ప్రాంగణంలో ఐలమ్మ చిత్రపటానికి సభాపతి ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరామ్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. గాంధీభవన్‌లో ప్రభుత్వం తరఫున పోరాటయోధురాలి జయంతిని అధికారికంగా జరిపారు. భూపాలపల్లిలో బస్టాండ్ వద్ద ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యన్నారాయణ ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ హయాంలో ఐలమ్మకు తగిన గౌరవం దక్కలేదు : బీఆర్ఎస్ హయాంలో వీరనారి చాకలి ఐలమ్మకు దక్కాల్సిన గౌరవందక్కలేదని మంత్రులు పొన్నంప్రభాకర్, జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. కోఠి మహిళ విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టే ధైర్యం ఎవరూ చేయలేదన్న మంత్రులు తమ ప్రభుత్వం యూనివర్సిటీ పేరుగా జీవోను విడుదల చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి పొన్నం, జూపల్లి హాజరయ్యారు. తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక మన తెలంగాణ వీరవనిత ఐలమ్మ అని ఆచార్య కోదండరామ్ కొనియాడారు.
"తెలంగాణ రాష్ట్ర సాధనలో వందలాది మంది ప్రాణత్యాగం చేశారు. వాళ్లు కూడా అందరిలానే ఏదో రకంగా బతికేవాళ్లే. కానీ తన చావుతో తెలంగాణ రావాలి, అన్ని వర్గాల వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని చాకలి ఐలమ్మ కంకణం కట్టుకోవడం జరిగింది. ఐలమ్మ జయంతి సందర్భంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం"- జూపల్లి కృష్ణారావు, మంత్రి
ఐలమ్మ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి : హైదరాబాద్ గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద ఐలమ్మ చిత్ర పటానికి రజక సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ట్యాంకుబండ్‌పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయాల్లోనూ పోరాటయోధురాలి జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సహా పార్టీనేతలు నివాళులర్పించారు. కోఠిలోని మహిళ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ పేరుపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఐలమ్మ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
'ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు.. పీడిత ప్రజల కోసం ఎనలేని పోరాటం చేశారు'