బయోకాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. వర్చువల్ అవార్డ్ వేడుకలో 'ఈవై వరల్డ్ ఎంటర్‌ప్రిన్యూర్ ఆఫ్ ది ఇయర్- 2020' పురస్కారం అందుకున్నారని బయోకాన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలకు చెందిన 46 మందికి ఈ పురస్కారం వరించిందని బయోకాన్ స్పష్టం చేసింది. ఈ జాబితాలో కిరణ్ పేరు కూడా ఉన్నట్లు తెలిపింది.
"ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకోవటం గర్వంగా ఉంది. ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ అనేది సమస్యలను అధిగమించటంపై ఆధారపడి ఉంటుంది. కష్ట సమయాల్లోనే గొప్ప అవకాశాలు వస్తాయి. ఇది నా ఎంటర్ప్రిన్యూరియల్ ప్రయాణంలో గొప్ప అనుభవం. నా వ్యాపారం ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు సంబంధించినది. అయినప్పటికీ ఎంటర్‌ప్రిన్యూర్‌గా వాటాదారులకు లాభం చేకూర్చటం నా బాధ్యత."
- కిరణ్ మజుందార్ షా
ఆర్థిక అభివృద్ధి, సంపద సృష్టిలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని షా అన్నారు. కానీ చాలా ఏళ్లుగా వాళ్ల కృషికి గుర్తింపు దక్కలేదని ఆమె ఆక్షేపించారు. వ్యవస్థాపక రంగం వైపు మరింత మంది మహిళలను ప్రోత్సహించేలా ఈ వేదికను ఉపయోగించుకుంటానని స్పష్టం చేశారు.
30 ఏళ్లుగా స్థిరమైన వృద్ధిని సాధించి పెట్టిన ఆమె సామర్థ్యం అవార్డ్ ప్యానెల్‌ను ఆకట్టుకుందని బయోకాన్ తెలిపింది. దేశంలోనే అతిపెద్ద బయోఫార్మాస్యూటికల్ కంపెనీగా ఎదిగిన బయోకాన్.. లాభాల కన్నా రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుందని స్పష్టం చేసింది.
ఈవై ఎంటర్‌ప్రిన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న మూడో భారతీయ వ్యక్తి మజుందార్. ఇంతకు ముందు ఉదయ్ కొటక్ (కొటక్ మహీంద్రా బ్యాంక్), నారాయణ మూర్తి (ఇన్ఫోసిస్)ని ఈ అవార్డు వరించింది.