కార్వీ స్టాక్ బ్రోకరింగ్ అకతవకలపై.. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. 'సెబీ' స్పందించింది. తాము ఎన్నడూ అనుమతించని పనులను కార్వీ చేసినట్లు సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగీ అన్నారు. వినియోగదారుల షేర్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఇటీవల ఆ సంస్థ కార్యకలాపాలను ఆపివేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'సెబీ ఇటువంటి అంశాలపై తన వైఖరిని జూన్‌లోనే స్పష్టం చేసింది. మేము ఏ పరిస్థితుల్లోనూ వినియోగదారుల సెక్యూరిటీలను వారికి తోచినట్లు చేయమని ఏ సందర్భంలోను చెప్పలేదు. అసలు ఏ రకంగాను అంగీకరించని విషయం ఇది' అని అజయ్ త్యాగి పేర్కొన్నారు.
కార్వీపై ఆరోపణలు ఇవే..
- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఇటీవల తనిఖీలు నిర్వహించింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) రూ.1096 కోట్లను తన గ్రూప్ కంపెనీ కార్వీ రియాల్టీకి ఏప్రిల్ 2016 నుంచి అక్టోబరు 2019 మధ్య బదిలీ చేసిందని ఆ తనిఖీలో తేలింది. ఇంకా క్లయింట్లకు చెందిన ఖాతాల్లో పలు అవకతవకలకు పాల్పడ్డట్లు తేలింది.
అవకతవకల వివరాలు..
- తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీల (డీపీ ఖాతాలో లేని)ను విక్రయించింది.
- అంతే కాకుండా.. మే 2019 వరకు ఈ తొమ్మిది మంది క్లయింట్లలో ఆరు మందికి చెందిన రూ.162 కోట్ల విలువైన అదనపు సెక్యూరిటీలను బదిలీ చేసింది.
- నలుగురు క్లయింట్లకు చెందిన రూ.257.08 కోట్ల విలువైన సెక్యూరిటీలను తనఖా పెట్టారు. అయితే 2019 జూన్-ఆగస్టు మధ్య ఆ షేర్లను తనఖా నుంచి విడిపించుకున్నప్పటికీ అందులో రూ.217.85 కోట్ల విలువైన షేర్లను కేఎస్‌బీఎల్ రికవరీ చేసుకుంది.
- 2019లో ఆ తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన ఖాతాల్లో అయిదు మంది నుంచి రూ.228.07 కోట్ల విలువైన షేర్లను కేఎస్‌బీఎల్ కొనుగోలు చేసింది.
- 156 క్లయింట్లు ఒక్క ట్రేడ్నూ నిర్వహించనప్పటికీ.. వారి నుంచి రూ.27.8 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేసింది.
- జూన్ 2019 నుంచీ కేఎస్‌బీఎల్‌తో ఎటువంటి ట్రేడింగ్ నిర్వహించనప్పటికీ.. 291 క్లయింట్ల నుంచి రూ.116.3 కోట్ల షేర్లను బదిలీ చేశారు.
ఇదీ చూడండి:జీఎస్టీ చెల్లించేవారికి కేంద్రం లాటరీ పథకం!