బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ రంగంలో సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేసింది రిలయన్స్ జియో. మార్కెట్ వర్గాలు, టెలికాం వినియోగదారులు.. ఇలా దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన 'జియో గిగా ఫైబర్' సేవలపై స్పష్టతనిచ్చింది. ముంబయిలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ.
బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలన్నింటినీ ఒకే దగ్గర అందించే 'జియో గిగా ఫైబర్' వాణిజ్య సేవలను ఈ ఏడాది సెప్టెంబర్ 5న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సామాన్య ప్రజలందరికీ అందుబాటు ధరలలో రూ. 700- 10, 000 మధ్య సేవలు లభ్యమవుతాయని వెల్లడించారు. కనిష్ఠంగా 100 ఎంబీపీఎస్ నుంచి గరిష్ఠంగా 1 జీబీపీఎస్ వరకు వేగంతో డేటా అందుతుందని చెప్పారు.
- జియో గిగా ఫైబర్ వాణిజ్య సేవలు ప్రారంభం-సెప్టెంబర్ 5
- కనీస ప్రారంభ ధర.. రూ. 700
- గరిష్ఠ ధర.. రూ. 10,000
- వేగం.. 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకు
రిలయన్స్ జియో 340 మిలియన్ వినియోగదారుల మార్కును చేరిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు అంబానీ.
హెచ్డీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితం...
జియో గిగా ఫైబర్ సేవల కింద అనేక ఆఫర్లు ప్రకటించారు అంబానీ. జియో వెల్కమ్ ఆఫర్ కింద సెట్‌టాప్ బాక్స్ సహా ఫుల్ హెచ్డీ టీవీ ఉచితంగా లభిస్తాయని తెలిపారు. అయితే.. ఇందుకోసం ఏడాది చందాను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. హెచ్డీ టీవీ వద్దనుకుంటే హోం కంప్యూటర్ లేదా 4కే సెట్‌టాప్ బాక్స్ అందిస్తామని తెలిపారు.
జియో సెట్‌టాప్ బాక్స్ ద్వారా వీడియో కాల్ సేవలు అందించనుంది రిలయన్స్ జియో. రూ. 500తో ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా వీడియో కాల్ సేవలు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
వచ్చే జనవరి నుంచి ఐఓటీ...
2020 జనవరి నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ. వచ్చే రెండేళ్లలో 2 బిలియన్ వినియోగదారులకు ఈ ఐఓటీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
ఫలితాల్లో ముందంజ...
రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ జియో... ఇంకా అనుబంధ సంస్థలన్నీ మంచి ఫలితాలతో దూసుకెళ్తున్నాయన్నారు అంబానీ. సంస్థ ప్రగతి, ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికల్ని ఏజీఎం వేదికగా వాటాదారులతో పంచుకున్నారు.
గతేడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డ్ సృష్టించిందని ప్రకటించారు. రిలయన్స్ రిటైల్ రూ. లక్షా 30 వేల కోట్ల వ్యాపారం చేసిందని వెల్లడించారు. భారత దేశంలో అత్యధిక పన్నులు చెల్లించిన సంస్థగా ఆర్ఐఎల్ నిలిచిందని గుర్తుచేశారు.
సౌదీ అరాంకోతో అతిపెద్ద ఒప్పందం...
పెట్రో కెమికల్స్ రంగంలో.. సౌదీ అరాంకోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏజీఎంలో ప్రకటించారు అంబానీ. ఆ సంస్థ దాదాపు 20 శాతం పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద సంయుక్త భాగస్వామ్యం అని వెల్లడించారు రిలయన్స్ ఛైర్మన్.
ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు ముకేశ్. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వ పాలన సాగుతోందని తెలిపారు. దేశం అభివృద్ది పథంలో దూసుకెళ్లేందుకు ఇదే సరైన సమయమని ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 కల్లా భారత్ 10 వేల ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవిస్తుందని అంచనా వేశారు.
ఇదీ చూడండి: జియో గిగాఫైబర్‌తో ఇక ఇంట్లోనే 'ఫస్ట్‌డే ఫస్ట్ షో'