ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలను రాబట్టింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ). జులై- సెప్టెంబర్‌కు గాను రూ. 6,360.05 కోట్ల నికర లాభం సంపాదించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 6,227.31గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నికర లాభం రూ. 5,941.37 కోట్లుగా ఉంది.
జులై- సెప్టెంబర్ మధ్యలో దాదాపు 19 మిలియన్ టన్నుల ఇంధనాన్ని విక్రయించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో 17.7 మిలియన్ టన్నులు విక్రయించినట్లు పేర్కొంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 15.27 మిలియన్ టన్నుల ముడిచమురును ఇంధనంగా మార్చినట్లు తెలిపింది. గతేడాది 13.96 మిలియన్ టన్నుల ముడిచమురు ఇంధనంగా మార్చినట్లు పేర్కొంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలను నిర్వహిస్తుంది. అయితే గతేడాది లాక్డౌన్ కారణంగా ప్రయాణ ఆంక్షలు విధించిన క్రమంలో ఐఓసీఎల్ లాభాలపై ప్రభావం పడింది.
ఇదీ చూడండి: Fuel Price Today: మరోసారి పెరిగిన చమురు ధరలు