స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో దేశీయ మదుపరుల సంపద అమాంతం పెరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఉద్దీపనలు ప్రకటించిన కొద్ది సేపటికే.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజిలోని మదుపరుల సంపద రూ.2,11,086.42 కోట్లు పెరిగింది. ప్రస్తుతం మదుపరుల పూర్తి సంపద రూ.1,40,79,839.48 కోట్లకు చేరింది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ అనూహ్యంగా 1807 పాయింట్లు బలపడి. ప్రస్తుతం 37,900 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 530 పాయింట్ల లాభంతో 11,235 వద్ద కొనసాగుతోంది.
ప్రోత్సాహకాలు ఎందుకంటే..
దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని పలు రేటింగ్ సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఇటీవల వెలువడిన గణాంకాలు ఇందుకు ఆజ్యం పోశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం పెరగటం, హోల్ సేల్ ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండటం, పారిశ్రామికోత్పత్తి తగ్గడం, వాహనాల అమ్మకాలు తగ్గడం వంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఉద్దీపన చర్యలకు పూనుకుంది.
ఇదీ చూడండి: దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గింపు:నిర్మల