దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఈ కాలంలో 6.3 శాతం వృద్ధితో రూ.4,335 కోట్ల నికర లాభాన్ని గడించినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ సాధించిన లాభాలు (రూ.4,078కోట్లు) కన్నా ఇది అధికమని స్పష్టం చేసింది.
అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సంస్థపై ప్రభావం పడుతుందని భావిస్తున్నందున 2020-21 ఆర్థిక ఏడాది అంచనాలను వెల్లడించలేదు. ఈ త్రైమాసికంలో సంస్థ ఆదాయం 8 శాతం పెరిగి రూ.23,267 కోట్లకు చేరిందని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది.
పదోన్నతులు నిలిపివేత..
కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ.. ఇప్పటికే కొత్తవారు, తాత్కాలికంగా నియామకాలు చేపట్టే వారికి ఇచ్చే అన్ని ఆఫర్లుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. అయితే.. జీతాల పెంపు, సిబ్బందికి పదోన్నతులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఆవరించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో సంస్థపై మరింత ప్రభావం ఉండనుందని అంచనా వేసింది.
" రానున్న కొద్ది రోజుల్లో మా వ్యాపారంపై ప్రభావం ఉంటుందని తెలుసు. ఎప్పుడు పూర్తి స్థాయిలో తిరిగి పుంజుకుంటుందనేది స్పష్టంగా తెలియదు."
-సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ