సమాచార నియంత్రణ విషయమై ట్విటర్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కొత్త నిబంధనల అమలుకు భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకుగాను 'మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నియమావళి'కి సంబంధించి ముసాయిదా తయారైనట్లు ఓ ప్రముఖ వార్తాసంస్థ తెలిపింది. అందులోని కీలకాంశాలను వెల్లడించింది. చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు 2018 నుంచి ప్రభుత్వం కఠిన నిబంధనల రూపకల్పనకు యోచిస్తోంది. తాజాగా రైతుల ఆందోళనలకు సంబంధించిన సమాచారాన్ని తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను ట్విటర్ పట్టించుకోకపోవడం దీనికి ఆజ్యం పోసింది. కొత్త ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం.. చట్టబద్ధమైన నిబంధనలు వర్తింపజేస్తారు.
- ఒక సమాచారాన్ని (కంటెంట్) తొలగించాల్సిందిగా ప్రభుత్వపరమైన లేదా చట్టబద్ధమైన ఆదేశాలిస్తే వీలయినంత త్వరగా 36 గంటలు దాటకుండా దాన్ని పాటించాల్సి ఉంటుంది.
- ఏదైనా దర్యాప్తు విషయం లేదా సైబర్ సంబంధిత సంఘటనలకు సంబంధించి అడిగిన మేరకు 72 గంటల్లోగా ఆయా సంస్థలు సహకారం అందించాల్సి ఉంటుంది.
- లైంగిక చర్యలు లేదా సంబంధిత అంశాలకు సంబంధించిన పోస్టులు ఉంటే వాటిపై ఫిర్యాదు అందిన రోజునే ఆ కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది.
- జాతి, మతపరమైన అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను పరిశీలించేందుకు కంపెనీలు ఓ అధికారిని నియమించాల్సి ఉంటుంది. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి ఓ అధికారిని నియమించాలి. వీరంతా భారత పౌరులే అయి ఉండాలి.
ఈ నిబంధనలు ఇతర డిజిటల్, ఆన్‌లైన్ మీడియాకు కూడా వర్తిస్తాయని ముసాయిదాలో పేర్కొన్నట్లు ఆ వార్తాసంస్థ వెల్లడించింది. అయితే ఈ నిబంధనలను ఎప్పుడు ప్రకటిస్తారన్నది స్పష్టం కాలేదని, వీటిలో కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ముసాయిదా నిబంధనల విషయమై ప్రస్తావించగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గానీ, ఫేస్‌బుక్, ట్విటర్‌లు గానీ స్పందించలేదని తెలిపింది.
ఇదీ చదవండి:గూగుల్, ఒప్పోకు శాంసంగ్ సాయం..!